Politics

రాఖీ పౌర్ణమి వేడుకల్లో తమిళిసై

రాఖీ పౌర్ణమి వేడుకల్లో తమిళిసై

తెలంగాణ రాజ్‌భవన్‌లో బుధవారం రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ అధికారులు, పాఠశాల విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆర్మీ అధికారులకు రాఖీ కట్టారు. ఇక, తమిళిసై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. రక్షా బంధన్ అనేది అన్నాచెల్లెళ్ల మధ్యే కాకుండా.. సమాజంలోని ప్రజలంతా జరుపుకునే పండగ అని అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలు, ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ అంతా కలిసి మెలిసి ఉంటామని చెప్పారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదని అన్నారు.

సైనికుల వల్లే మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నామని.. రాఖీ కట్టి వారికి మన కృతజ్ఞతలు తెలుపుకోవడం ముఖ్యమని అన్నారు. సైనికుల గురించి పిల్లలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణకు తానొక తోబుట్టువునని, రాజ్‌భవన్‌లో జరుపుకుంటున్న వేడుకలతో రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ కడుతున్నానని భావిస్తున్నానని చెప్పారు.

‘‘ఇప్పుడు మనం చందమామపై కూడా రక్షా బంధన్ జరుపుకుంటున్నాం. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. అందుకే మన అంతరిక్ష శాస్త్రవేత్తలను చూసి మనం చాలా గర్విస్తున్నాము. అటువంటి పరిస్థితిని సృష్టించినందుకు మన ప్రధానికి ధన్యవాదాలు. మనం చంద్రుడి వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు సూర్యుడిని కూడా చేరుకోబోతున్నాం. ఇది మన శాస్త్రవేత్తల నుండి గొప్ప చొరవ’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.