సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని.. 15 నాటికి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామన్నారు. దీనిపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్ 1.0 (సీఏఆర్‌డీ–కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) వెర్షన్‌ను 1999లో రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ సేవలను వేగంగా, నాణ్యంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి కార్డ్ 2.0 వెర్షన్‌ను రూపొందించి అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. కొత్త విధానంలో యజమానుల సంతకాలతో ఉండే భౌతిక దస్తావేజులు పూర్తిగా కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్డ్ 2.0లో దస్తావేజులను ఆన్‌లైన్‌లో తయారుచేసుకుని, ఆన్‌లైన్‌లోనే స్లాట్ బుక్ చేసుకుని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చన్నారు. లేనిపక్షంలో తాము తయారు చేసుకున్న దస్తావేజు సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించారు.
ప్రస్తుత విధానంలో యజమానులు తాము తయారుచేసుకున్న దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని రామకృష్ణ గుర్తు చేశారు. కొత్త విధానంలో ప్రజలకు సమయం ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా దస్తావేజులోని వివరాలు వారే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల దస్తావేజులు తప్పులు లేకుండా ఉంటాయని చెప్పారు. చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీల వివరాలను వారే సొంతంగా లెక్కించుకోవచ్చని, ఆ చార్జీలను సులువుగా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం తమకు కుదిరే టైమ్ స్లాట్ బుక్ చేసుకొని కేవలం 20 నిమిషాల్లోనే సాఫీగా పని పూర్తిచేసుకోవచ్చని తెలిపారు. దస్తావేజుల స్కానింగ్ ప్రక్రియ కూడా ఉండదని.. రిజిస్ట్రేషన్ తర్వాత 20 నిమిషాల్లోనే దస్తావేజులు కూడా జారీ చేస్తారన్నారు. ఆధార్ లింక్ చేయడం వల్ల తప్పుడు వ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రమాదం కూడా ఉండదన్నారు. దస్తావేజుల తయారీదారులు, లేఖరులు, న్యాయ నిపుణులకు కొత్త విధానం వల్ల పని సులువు అవుతుందని వెల్లడించారు. వారి ఉపాధి పోతుందనేది అపోహ మాత్రమేనన్నారు. ఈ విధానంలో వినియోగదారులు.. మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ రిజిస్ట్రేషన్‌ను తామే సులువుగా పూర్తిచేసుకోవచ్చన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
కొత్త విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన విక్రయ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహశీల్దార్ కార్యాలయాన్ని మ్యుటేషన్ కోసం సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్ మ్యుటేషన్ జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఈ విధానాన్ని రూపొందించామని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం దస్తావేజులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా అధికారులకు సమర్పించే అవకాశం ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలంటే http://registration.ap.gov.in లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.