హిమాలయాల్లో రెండు నెలలపాటు సాగే ‘అమర్‌నాథ్ యాత్ర’ (Amarnath Yatra) ముగిసింది. మంచుకొండల్లో కొలువుదీరే హిమలింగాన్ని (Cave Shrine) ఈ ఏడాది 4.4లక్షల మంది దర్శించుకున్నారు. 62 రోజులపాటు సాగిన ఈ యాత్ర గురువారంతో ముగిసినట్లు అధికారులు పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈసారి కూడా అమర్‌నాథ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగిందన్నారు.దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో వెలిసే మంచులింగం (Shivling) యాత్ర జులై 1న మొదలైంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కి.మీ. పొడవైన నునవాన్-పహల్గామ్ మార్గంతో పాటు గందేర్బల్ జిల్లాలోని 14 కి.మీ పొడవైన బల్తల్ మార్గంలో సాగిన ఈ యాత్రలో 4.45లక్షల మంది పాల్గొని శివలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 62 రోజులపాటు సాగిన ఈ యాత్ర క్రమంలో.. మొత్తం 48మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇందులో యాత్రికులు, సేవకులు ఉన్నారని చెప్పారు. వాతావరణ సంబంధిత, సాధారణ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో సాధువులు, యాత్రికులు పెహల్గామ్ నుంచి 42కి.మీ దూరం నడిచి అమర్‌నాథ్‌కు చేరుకున్నారు. అనంతరం చివరి రోజు (గురువారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతేడాది 3.65లక్షల మంది అమర్‌నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరుకోవడం గమనార్హం.