అమెరికా(USA)లోని మూడు రాష్ట్రాలను ఐడాలియా (Idalia) తుఫాను వణికిస్తోంది. ఉత్తర కరోలినా, జార్జియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరోలినాలో కొన్ని చోట్ల గంటకు 60 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనిని ఇప్పటికే కేటగిరీ-3 శ్రేణికి చెందిన హరికేన్‌గా ప్రకటించారు. ముఖ్యంగా ఫ్లొరిడాలో ఈ తుపాను కారణంగా అతిభారీ వర్షాలు కురిశాయి. బిగ్‌బెండ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక్కడ గత 125 ఏళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలోకి నీటిమట్టాలు పెరిగాయి. ఫలితంగా వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా బిగ్‌బెండ్ ప్రాంతంలోని కెటోన్ బీచ్ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది.
దీంతోపాటు జార్జియా, కరోలినా ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర కరోలినాలో మెరుపు వరదలు వచ్చాయి. ఇక ఫ్లొరిడా రాష్ట్రంలోని పాస్కో కౌంటీలో వరదల నుంచి 150 మందిని కాపాడారు. ఐడాలియా కారణంగా పలు ప్రాంతాల్లో దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల మూడు నుంచి ఐదు అడుగుల మేరకు నీరు చేరింది. ఫ్లొరిడాలోని పెస్కో కౌంటీలో దాదాపు 6,000 ఇళ్లు నీట మునిగాయి. ఇక దక్షిణ కరోలినాలోని కార్ల్‌స్టోన్ హార్బర్‌లో నీటి మట్టం తొమ్మిది అడుగులు పెరిగిపోయింది. నేషనల్ వెదర్ సర్వీస్ రికార్డుల ప్రకారం ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు నమోదైన ఐదో అత్యధిక పెరుగుదల ఇదే. సీడెర్ కీ, ఈస్ట్‌బే టంపా, క్లియర్ వెదర్ బీచ్ వంటి చోట్ల కూడా నీటి మట్టం పెరిగింది. గురువారం తెల్లవారుజాము సమయానికి ఒక్క ఫ్లొరిడాలోనే దాదాపు 1,43,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జార్జియాలో మరో 1,26,000 ఇళ్లకు, దక్షిణ కరోలినాలో మరో 34వేల ఇళ్లలో, ఉత్తర కరోలినాలో 18వేల ఇళ్లకు కరెంటుసౌకర్యం నిలిచిపోయింది. ఫ్లోరిడాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కాచిన నీటిని తాగాలని అధికారులు సూచించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ నోటీస్ జారీ చేసింది.