Business

సెప్టెంబర్ లో అనేక కీలక ఆర్థిక సమస్యలకు ముగియనున్న గడువు

సెప్టెంబర్ లో అనేక కీలక ఆర్థిక సమస్యలకు ముగియనున్న గడువు

మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లు నామినీని ఎంచుకోవడానికి సెప్టెంబరుతో గడువు (September Deadline) ముగియనుంది. కొన్ని బ్యాంకులు తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో మదుపు చేసేందుకూ సెప్టెంబరే చివరి నెల. ఇలా సెప్టెంబరు నెలలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు కీలక మార్పులేంటో చూద్దాం..!

రూ.2,000 నోట్లు మార్చుకున్నారా?
చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్న నోట్లను మార్చుకోవడం లేదా ఖాతాలో డిపాజిట్‌ చేసేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది (September Deadline).

నామినీని ఎంచుకున్నారా?
2022 అక్టోబర్‌ 1 తర్వాత ఫోలియో జనరేట్‌ అయిన కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లకు నామినీ ఎంచుకోవడమో లేదా వద్దనుకుంటున్నట్లో ధ్రువీకరించాలి. అంతకంటే ముందు నుంచి ఫండ్లలో మదుపు చేస్తున్నవారు నామినీని ఎంచుకోవడంగానీ లేదా వద్దనుకుంటున్నామనిగానీ ధ్రువీకరణ సమర్పించాలి. దీనికి సెప్టెంబరు 30 తుది గడువు. తర్వాత ధ్రువీకరణ సమర్పించనివారి ఖాతాల్లో నిర్వహణ నిలిచిపోతుంది. స్టాక్‌ మార్కెట్‌ మదుపర్లకు సైతం ఇది వర్తిస్తుంది. లేదంటే డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాలు నిలిచిపోతాయి.

ప్రత్యేక ఎఫ్‌డీల్లో మదుపు..
మే 2022 నుంచి ఆర్‌బీఐ రెపోరేటు పెంచింది. దీంతో బ్యాంకులు ఫిక్స్‌ డిపాజిట్‌ వడ్డీరేట్లను సైతం అందుకు అనుగుణంగా సవరించాయి. ఈ క్రమంలో కొన్ని బ్యాంకులు అధిక వడ్డీరేట్లతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను తీసుకొచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి వచ్చిన అమృత్‌ మహాత్సవ్‌ ఎఫ్‌డీ సెప్టెంబరు 30తో ముగియనున్నది. దీంట్లో సీనియర్‌ సిటిజెన్స్‌కు 7.60 శాతం, ఇతరుకు 7.1 శాతం వడ్డీరేటు ఆఫర్‌ చేస్తున్నారు. అలాగే ఎస్‌బీఐ వీకేర్‌ ఎఫ్‌డీ ద్వారా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితితో చేసే డిపాజిట్లకు సీనియర్‌ సిటిజెన్స్‌ 50 బేసిస్‌ పాయింట్ల అధిక వడ్డీరేటును పొందొచ్చు. దీనికి కూడా సెప్టెంబరుతో గడువు ముగుస్తుంది. ఇలా మరికొన్ని బ్యాంకుల్లోనూ ఎఫ్‌డీలు అందుబాటులో ఉన్నాయి.

ఇండియా పోస్ట్‌లో ఆధార్‌ ఇచ్చారా?
కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఇండియా పోస్ట్‌ మే నెలలో తమ ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆధార్‌ వివరాలు ఇవ్వనివారు సెప్టెంబరు 30 కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. అలాగే పాన్‌ వివరాల సమర్పణకు కొన్ని నిబంధనలు విధించింది. ఖాతాలో ఉన్న డిపాజిట్‌ మొత్తం రూ.50 వేలు దాటినా; ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల మొత్తం విలువ రూ.1 లక్ష మించినా; ఒక నెలలో బదిలీ లేదా ఉపసంహరణ మొత్తం రూ.10 వేలు దాటినా.. ఈ మూడు సందర్భాల్లో రెండు నెలల్లోగా పాన్‌ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌..
ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు సెప్టెంబరు 14తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును ఇప్పటికే అనేక మార్లు పొడిగించింది. ఆధార్‌ కార్డులో పేరు, పుట్టినతేది, చిరునామా వంటి మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.