DailyDose

చిత్తూరు జిల్లాలో అటవీశాఖకి చిక్కిన ఏనుగు

చిత్తూరు జిల్లాలో అటవీశాఖకి చిక్కిన ఏనుగు

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో బీభత్సం సృష్టించిన ఒంటరి ఏనుగును ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు గురువారం బంధించారు. పంటపొలాల్ని ధ్వంసం చేస్తూ.. పశువుల్ని తొక్కేసుకుంటూ వెళ్లిన ఏనుగు.. చివరికి ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. సి.కె.పల్లె గ్రామంలోని సుధాకర్‌నాయుడి మామిడి తోటలోకి బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఒంటరి ఏనుగు ప్రవేశించింది. ఆ సమయంలో తోటలో కొమ్మలు కత్తిరించేందుకు వెళ్లిన బసవాపల్లెకు చెందిన కార్తీక్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆపై సీఎంసీ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న పొలాల్లోకి వెళ్తూ.. ఎదురొచ్చిన పశువులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఓ ఆవు, దూడ మృతి చెందాయి. అటు నుంచి పొలంలోకి వెళ్లి అక్కడ గడ్డి కోస్తున్న 190.రామాపురం ఎస్సీ కాలనీకి చెందిన దంపతులు వెంకటేష్‌(50), సెల్వి(45)లను తొక్కింది. దంతాలతో పొడిచింది. దంపతులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనంతరం ఏనుగు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.గ్రామస్థులు ఆందోళనతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు కుప్పం నుంచి 2 శిక్షణ ఏనుగులు తెప్పించి ఒంటరి ఏనుగును బంధించేందుకు ప్రణాళిక రూపొందించారు. వాటి సాయంతో మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి ఏనుగును బంధించారు. ఏనుగును తిరుపతి జూపార్కుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు గజరాజును బంధించడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.