ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగులు నిరసన తెలిపేందుకు మరో తేదీని చెప్పాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఉద్యోగుల అందోళనకు తొలుత పోలీసులు అనుమతిచ్చారని, ఆతర్వాత నిరాకరించారని ఉద్యోగుల తరఫు న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు పట్టించుకోకుండా అనుమతి రద్దు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.గతంలో చలో విజయవాడ పేరుతో ఆందోళన నిర్వహించినప్పుడు నగరంలో జనజీవనం స్తంభించిందని, ఉద్యోగుల ఆందోళనకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం పరిమితులకు లోబడి అనుమతులు ఇస్తామని తెలిపింది. ఆందోళనలో పాల్గొనే ఉద్యోగులు ఐడీ కార్డులు చూపాలని, , పరిమిత సంఖ్యను సూచించింది. ర్యాలీలు నిర్వహించకుండా ఒక చోట కూర్చుని నిరసన తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, షెడ్యూల్ ప్రకారం శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా.. మరో తేదీని ప్రకటించాలని ధర్మాసనం ఉద్యోగ సంఘం నేతలకు సూచించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.