తెదేపా గుర్తు ‘సైకిల్’ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీకని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ’పై రేపటి నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు.. 3 కోట్ల మందిని కలిసే కార్యక్రమంలో ప్రజల సహకారం, భాగస్వామ్యం కావాలని కోరారు.
2014 – 19 మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను.. నేటి పాలకులు నాలుగున్నరేళ్లలో సర్వ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, మహిళా సాధికారత, భద్రత అటకెక్కిందని దుయ్యబట్టారు. వైకాపా పాలనలో పెట్టుబడుల మాటే లేదని.. నిరుద్యోగం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో పథకాలను ప్రకటించామని వెల్లడించారు.
సెప్టెంబరు 1 నుంచి 45 రోజుల పాటు ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, నేతలు.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆర్థిక పరిపుష్టి, రక్షణ, భవిష్యత్తు కోసం రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ఉద్దేశాలను, వాటి వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తారన్నారు. ప్రజలు వారి సమస్యలపై వారితో చర్చించాలన్నారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి తన సంతకంతో కూడిన హామీ పత్రాన్ని ప్రజలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. మన రాష్ట్ర భవిష్యత్ కోసం.. అందరి భాగస్వామ్యం, మద్దతు, సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దసరా రోజు సమగ్ర మేనిఫెస్టో ప్రకటించబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.