భారత్-అమెరికా రక్షణ సహకారంలో కీలక ముందడుగు పడింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం జెట్ ఇంజిన్ల తయారీకి సంబంధించిన చారిత్రక జీఈ ఏరోస్పేస్- హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య కుదిరిన అగ్రిమెంట్‌కు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది జూన్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందం కుదిరింది.బైడెన్ ప్రభుత్వం తాజా ఆమోదముద్రతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. భారత్‌కు అత్యాధునిక సాంకేతికత బదిలీ, భారత్‌లో జెట్ ఇంజిన్ల తయారీ వంటివి ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందాన్ని ‘బిగ్ గేమ్ చేంజర్’గా హెచ్ఏఎల్ చీఫ్ సీబీ అనంతకృష్ణన్ తెలిపారు. డీల్‌లో భాగంగా 99 జెట్ ఇంజిన్ల కో ప్రొడక్షన్ ఉంటుంది. సాంకేతికత బదిలీ కారణంగా ఇది తక్కువ ఖర్చుతోనే పూర్తవుతుంది. ఇందులో భాగంగా ఉత్పత్తి చేసే ఎఫ్ 414 ఇంజిన్లు విశ్వసనీయత, అద్భుతమైన పనితీరుకు పేరుగాంచాయి. నాలుగు దశాబ్దాలుగా భారత గడ్డపై ఉన్న జీఈ ఏరోస్పేస్ ఇప్పుడు ఇంజిన్లు, ఏవియానిక్స్, సేవలు, ఇంజినీరింగ్, తయారీ వంటి వాటికి ఊతం ఇవ్వనుంది.