అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్-28 ను గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక కొత్త రకం ఐసోటోప్ అని సైంటిస్టులు తెలిపారు.
ఈ ఆక్సిజన్-28 ఐసోటోప్ 20 న్యూట్రాన్‌లను, ఎనిమిది ప్రోటాన్‌లను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఈ ఆక్సిజన్ పరిమాణంలో పెద్దదిగా చెప్పవచ్చు. అయితే ఈ ఆక్సిజన్ ఐసోటోప్ అంచనాల కంటే కొంత తక్కువ స్థిరత్వాన్నే కలిగి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, అణు భౌతిక శాస్త్రంలో ఇది ప్రధానమైన డిస్కవరీ అంటున్నారు.ఇరవై న్యూట్రాన్‌లు (N=20), ఎనిమిది ప్రోటాన్‌లు (Z=8) కలిగి ఉండి చాలాపెద్ద న్యూట్రాన్, ప్రోటాన్ నిష్పత్తిగల ఈ ఆక్సిజన్ ఐసోటోప్‌ను ప్రకృతిలో అసాధారణమైనదిగా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్ అణు ప్రయోగాలకు ఈ ఐసోటోప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.