ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరైనా ఏదైనా పొరపాటున నోరుజారితే అంతే సంగతలు.. నెట్టింట రచ్చ రచ్చ చేసేందుకు జనాలు రెడీగా ఉంటారు. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇందుకు కారణంగా.. రాజీవ్ గాంధీని కలిశానని షర్మిల నోరు జారడమే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల గురువారం ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. 10 జనపథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన షర్మిల దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. ‘‘సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని కలవడం జరిగింది. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖరరెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీ అందరితో ఒకే విషయం చెబుతున్నా.. కేసీఆర్ కౌంట్‌డౌన్ మొదలైంది’’ అని పేర్కొన్నారు.
అయితే ఇక్కడ రాహుల్ గాంధీ పేరుకు బదులు రాజీవ్ గాంధీ అని షర్మిల నోరు జారడంతో.. నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. ‘‘1991 లోనే పరమదించిన రాజీవ్ గాంధీ గారిని ఈరోజు ఢిల్లీలో కలిసొచ్చిన గొప్ప నాయకురాలు మన షర్మిలమ్మ’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘మీరు ఇందిరా గాంధీని కలవలేదా?’’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు. కొందరైతే.. షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్‌ను కూడా ప్రస్తావిస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.