NRI-NRT

వివేక్ పై ట్రంప్ మరోసారి ప్రశంసలు

వివేక్ పై ట్రంప్ మరోసారి ప్రశంసలు

రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివేక్‌ గురించి స్పందించారు. ‘ఆయన చాలా చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఎంతో చురుగ్గా ఉంటారు’ అని అన్నారు. అలాగే మీరు ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా? అని ప్రశ్నించగా.. ‘ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నాను’ అని బదులిచ్చారు.

ఇటీవల ఆగస్టు 23వ తేదీన రిపబ్లికన్‌ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌(Republican debate) జరిగింది. దీనిలో డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొనలేదు. ఈ చర్చా కార్యక్రమంలో వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ తదితర ఆశావహులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ట్రంప్‌ తన అభిప్రాయం వెల్లడిస్తూ వివేక్‌ను అభినందించారు. ‘డిబేట్‌లో వివేక్‌ రామస్వామి నిజాయతీ కారణంగా భారీ విజయం సాధించినట్లు నేను భావిస్తున్నాను. థాంక్యూ వివేక్‌’ అని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో అందరికంటే ట్రంప్(Donald Trump) ముందు ముందున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల పార్టీ సదస్సులో రామస్వామి తన వాదనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ, ట్రంప్‌పై కేసులు, ఇతర కారణాలతో అధ్యక్ష పోటీలో చివరి వరకు నిలుస్తారా.. అన్నదే సందేహాస్పదంగా మారింది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి యత్నిస్తున్నారు. ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైతే తాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండటానికి కూడా రామస్వామి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.