Business

బీసీసీఐ తో వయాకామ్ 18 ఒప్పందం

బీసీసీఐ తో వయాకామ్ 18 ఒప్పందం

భారత్‌ వేదికగా బీసీసీఐ (BCCI) నిర్వహించే మ్యాచ్‌లకు సంబంధించి మీడియా హక్కులను వయాకామ్‌ 18 దక్కించుకుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం రూ.5,963 కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. స్వదేశంలో 2023-28 సీజన్‌లో జరగనున్న అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది.

టీవీ ప్రసారాలు స్పోర్ట్స్‌ 18లోనూ, జియో సినిమా ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అంతర్జాతీయంగా 88 ద్వైపాక్షిక మ్యాచ్‌లు (వాటిని ఇంకా 102కి పెంచే అవకాశం ఉంది) ప్రసారం చేసే హక్కులను వయాకామ్‌ 18 దక్కించుకుంది. ఇందులో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 అంతర్జాతీయ టీ20లు ఉన్నాయి. ఈ-వేలంలో వయాకామ్‌కు సోనీ పిక్చర్స్‌, డిస్నీ స్టార్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.టీవీ, డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న వయాకామ్‌ 18 సంస్థకు బీసీసీఐ కార్యదర్శి జైషా అభినందనలు తెలిపారు. ‘‘బీసీసీఐ మీడియా హక్కులను దక్కించుకున్న వయాకామ్‌ 18కి శుభాకాంక్షలు. వచ్చే ఐదేళ్ల కాలంలో భారత క్రికెట్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఐపీఎల్‌, మహిళా టీ20 క్రికెట్‌ లీగ్‌ తర్వాత భారత క్రికెట్‌ ఉన్నతస్థానాలకు చేరుకుంది. క్రికెట్ అభిమానులకు అంచనాలను కలిసి చేరుకోగలమనే నమ్మకం ఉంది. అలాగే ఈ-వేలంలో పాల్గొన్న స్టార్ ఇండియా, డిస్నీ హాట్‌స్టార్‌కు ధన్యవాదాలు. ఎన్నో ఏళ్లుగా మద్దతుగా నిలిచారు. భారత క్రికెట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో మీరు కీలక పాత్ర పోషించారు’’ అని జైషా ట్విటర్ వేదికగా స్పందించారు.

ఇప్పుడీ మీడియా హక్కులతో వయాకామ్‌ క్రీడాప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు అయింది. భారత మ్యాచ్‌లతోపాటు, ఐపీఎల్ (డిజిటల్), మహిళా ప్రీమియర్‌ లీగ్ 2024, పారిస్‌ ఒలింపిక్స్‌ 2024, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు, టీ10 లీగ్, రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌, దక్షిణాఫ్రికా20 ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌, ఎన్‌బీఏ, డైమండ్‌ లీగ్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా గేమ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది.