Business

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు విదేశీ పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. తాజాగా మెటీరియల్‌ సైన్సెస్‌ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్‌ సంస్థ రాబోతోంది. భారతదేశంలో మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ తయారు చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా కార్నింగ్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జాన్‌ బేన్‌, గ్లోబల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ రవికుమార్‌, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్‌ సారా కార్ట్‌మెల్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు.రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేశంలో.. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కార్నింగ్‌ సంస్థ నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. సుమారు రూ.934 కోట్ల పెట్టుబడి వెచ్చించి కార్నింగ్‌ సంస్థలో స్థాపించనున్న స్మార్ట్‌ ఫోన్ల గొరిల్లా గ్లాస్‌ తయారీ కంపెనీ ద్వారా 800 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ పోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి అని కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు.