TS:ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి గడువు పొడిగించారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. రూ. వెయ్యి ఆలస్య రుసుంతో ఈ నెల 16 వరకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్ ఫస్టియర్‌లో ఇప్పటి వరకు 4,92,873 మంది చేరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అయితే 83,177 మంది విద్యార్థులు చేరగా, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో 3,11,160 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు.
ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని విద్యార్థులకు, వారి పేరెంట్స్‌కు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ సూచించారు. అనుమతి పొందిన కాలేజీల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, ఆయా కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు.