విపక్ష పార్టీలు ఏకమైతే బీజేపీ గెలుపు అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. దేశ జనాభాలో 60 శాతం జనాభాకు విపక్ష కూటమి పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయని పేర్కొన్నారు. ఈ దశలో ఇండియా కూటమి దేశ జనాభాలో 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యవ వహిస్తోందని, రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఏకమైతే బీజేపీకి గెలుపు అసాధ్యమని, సమర్ధవంతంగా విపక్షాల కలయిక జరగాలని రాహుల్ పేర్కొన్నారు. ముంబైలో ముగిసిన విపక్ష ఇండియా కూటమి భేటీలో ఈరోజు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటుతో పాటు సీట్ల సర్దుబాటు చర్చలను వేగవంతం చేయాలని నిర్ణయించామని అన్నారు.
ఇండియా కూటమి కాషాయ పార్టీని మట్టికరిపించేందుకు ఈ నిర్ణయాలు అవసరమని చెప్పారు. ఈ కూటమిలో నేతల మధ్య సంబంధాల బలోపేతమే అసలైన కార్యాచరణ అని రాహుల్ పేర్కొన్నారు. విపక్ష పార్టీల మధ్య గత రెండు భేటీల్లో అనుబంధం, అరమరికలు లేని స్నేహ బంధం మొగ్గతొడిగాయని చెప్పుకొచ్చారు. ఇక నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్‌డీయే నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అంతకుముందు పేర్కొన్నారు. ముంబైలో ముగిసిన విపక్ష కూటమి ఇండియా భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఖర్గే ఇండియా సమైక్యంగా నిలిచింది..ఇండియా విజేతగా నిలుస్తుందని క్యాప్షన్ ఇచ్చారు.
పురోగామి, సంక్షేమ, సమ్మిళిత ఇండియా కోసం తాము కలిసికట్టుగా నిలిచామని ఖర్గే రాసుకొచ్చారు. దేశంలో మార్పు అవసరమని 140 కోట్ల భారతీయులు నిర్ణయించుకున్నారని అన్నారు. ఇక ఈ నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్‌డౌన్ ఆరంభమైందని పేర్కొన్నారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా కలిసికట్టుగా పనిచేయాలని పలు తీర్మానాలు చేసిన విపక్ష ఇండియా సమావేశంలో కీలక కమిటీలనూ ఏర్పాటు చేశారు. 12 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించామని భేటీ అనంతరం శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
సమన్వయ కమిటీలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), టీఆర్ బాలు (డీఎంకే), హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (ఎస్ఎస్-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లలన్ సింగ్ (జేడీయూ), డీ. రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), సీపీఎం నుంచి మరో సభ్యుడు ఉంటారని రౌత్ తెలిపారు.అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులతో కూడిన నాలుగు ప్రధాన కమిటీలను ఈ సమావేశంలో ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రచార కమిటీ, సోషల్ మీడియా వర్కింగ్ గ్రూప్ కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చి కమిటీలను కూడా నియమించామని తెలిపారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ సమావేశంలో విపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది.