DailyDose

అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం-TNI నేటి తాజా వార్తలు

అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం-TNI నేటి తాజా వార్తలు

అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై చంద్రబాబు ఆగ్రహం

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులతో పోలీసులు ఆయన్ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్‌ చేస్తారా?అని నిలదీశారు. ‘‘పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్‌ చేసే దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అయ్యన్నను అక్రమంగా అరెస్ట్‌ చేసి కక్ష సాధిస్తున్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారు? అలా అయితే మంత్రులు, వైకాపా నేతలు చేసే వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లో పెట్టాలి. ధైర్యం ఉంటే విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్‌ తప్పుల్లో పోలీసులు భాగస్వాములైతే భారీ మూల్యం చెల్లించక తప్పదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అయ్యన్న అరెస్ట్‌ జగన్‌ నిరంకుశ పాలనకు పరాకాష్ఠ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం సభలో అయ్యన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్య మూలాలను జగన్‌ ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తారా?’’అని అచ్చెన్న మండిపడ్డారు.

హైదరాబాద్‌లో CWC సమావేశాలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16, 17వ తేదీల్లో సమావేశాలు ఉంటాయని… పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సీడబ్ల్యూసీ సమావేశాలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. అందువల్లే హైదరాబాద్‌లో సమావేశాలకు అధిష్ఠానం ఆమోదించినట్లు సమాచారం.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం.. అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్ గాంధీ సహా సీడబ్ల్యూ సభ్యులంతా హైదరాబాద్‌కు తరలి రానున్నారు. రాష్ట్ర ఎన్నికలే లక్ష్యంగా  కార్యక్రమాల రూపకల్పన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐతే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ప్రకటించడంతో.. సీడబ్ల్యూసీ సమావేశాల  తేదీలు మారే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఏది ఏమైనా రాష్ట్ర కాంగ్రెస్​కు ఈ సమావేశాలు హైదరాబాద్​లో నిర్వహించడం కాస్త కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. జాతీయ నేతలు హైదరాబాద్ వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలు రూపొందించాలనే యోచనలో రాష్ట్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు సీబీఐ కోర్టుకు వెళ్లిన విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  శుక్రవారం ఉదయం సీబీఐ కోర్టుకు వచ్చారు. విదేశీ పర్యటనకు ఎంపీకి సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ కోర్టుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో డిపాజిట్ చేసిన పాస్‌పోర్ట్‌ను తీసుకుని వెళ్లిపోయారు.కాగా.. విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి  సీబీఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రికి న్యాయస్థానం అనుమతించింది. కుమార్తెలను చూడటానికి కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ కోర్టును కోరారు. విచారణ అనంతరం ధర్మాసనం సీఎంకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా విదేశాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు విజయసాయిరెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు విజయసాయిరెడ్డి కోర్టుకు తెలియజేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలలో స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 31, 2023)న తిరుమల శ్రీవారిని 59, 808 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,618 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.6కోట్లుగా లెక్క తేలింది. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చేస్తోంది టీటీడీ.

ఇండియా కూటమి సెకండ్ డే మీటింగ్ స్టార్ట్

దేశం ఎన్నికల వాతావరణంలోకి వెళ్లిపోయింది. ముంబయిలో ఇండియా కూటమి నేతల రెండో రోజు సమావేశం ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటలకు సమావేశం మొదలైంది. 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో యుద్ధప్రాతిపదికన ఎన్నికలకు కూటమిని సిద్ధం చేయాలని కూటమిలోని పార్టీలు నిర్ణయించుకున్నాయి.ఇవాళ్టి సమావేశంలో కూటమి లోగో ఆవిష్కరణ, కన్వీనర్ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కన్వీనర్‌గా ఎవరు నియమితులు కాబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. 11 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కమిటీలో ఏయే పార్టీలకు ప్రాతినిథ్యం ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. ఇక సీట్ల సర్దుబాటు, మినిమమ్ కామన్ ప్రోగ్రామ్ ప్రణాళిక, కూటమి రోడ్ మ్యాప్‌పై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇండియా కూటమికి కన్వీనర్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే కన్వీనర్ బాధ్యతలు స్వీకరించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ విముఖత చూపుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేనే ఇండియా కూటమికి కన్వీనర్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే జరిగితే లోక్ సభ ఎన్నికల ముంగిట్లో ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్ మరింత కీ రోల్‌గా మారే అవకాశం ఉంటుంది.

లోకేశ్‌ను కలిసిన పోతవరం రైతులు

 టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నల్లజర్ల మండలం పోతవరం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తాడిపూడి కాలువ నుంచి తమ వ్యవసాయ భూములకు నీరు రావడం ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా వరి నారు ఎండిపోయిందని.. కొన్ని భూముల్లో నీరు లేక వరినాట్లు వేయలేదని తెలిపారు. తాడిపూడి కాల్వ నుంచి నీరు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. సీతామావు డ్యామ్ ఆరు సంవత్సరాల క్రితం వరదల్లో కొట్టుకుపోయిందని ఇప్పటికీ మరమ్మతులు లేవని తెలియజేశారు. పోతవరం నుంచి యర్నగూడెం రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. పోతవరం -నల్లజర్ల రహదారి వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయిందని గ్రామస్తులు తెలియజేశారు.నారా లోకేష్ స్పందిస్తూ… జగన్ రెడ్డి అడ్డగోలు దోపిడీ వలన రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. ప్రాజెక్టులకు కనీసం సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో దివాలాకోరు ప్రభుత్వం ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక తాడిపూడి కాల్వ నుంచి పోతవరం పొలాలకు నీరందించే అవకాశాన్ని పరిశీలిస్తామని.. సీతామావు డ్యామ్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్ పేర్కొన్నారు.

టీడీపీ నేతల ముందస్తు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు.అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి బెయిల్‌ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా,  అరెస్ట్‌ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు.

 కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో ఓ యువకుడు దారుణ హత్య

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజూమున కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ నివాసంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, మంత్రి ఇంట్లో మృతి చెందిన యువకుడు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ కొడుకు వికాశ్ కిషోర్ స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవగా పోలీసులు నిర్ధారించారు. సోమవారం తెల్లవారుజూమున 4.15 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఘటనాస్థలి నుండి మంత్రి కుమారుడి పేరుతో ఉన్న లైసెన్స్డ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ స్పందించారు. తన నివాసంలో యువకుడి హత్య జరిగిన సమయంలో తన కొడుకు ఇంట్లో లేడని కేంద్రమంత్రి తెలిపారు. కాగా, కౌశల్ కిషోర్ ప్రస్తుతం కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ సహయశాఖ మంత్రిగా ఉన్నారు. స్వయంగా కేంద్రమంత్రి ఇంట్లోనే యువకుడు దారుణ హత్యకు గురి కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మాగుంట రాఘవరెడ్డిపై కుట్ర

‘ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డిపై కొందరు కుట్ర చేశారు. దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆయనను ఇరికించారు. రాఘవరెడ్డి ప్రజల్లోకి రావాలి. ప్రకాశంజిల్లా రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించాలి. ఇటువంటి తరుణంలో ఆ కుటుంబానికి వైకాపా శ్రేణులు అండగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కొన్నినెలల పాటు తిహార్‌ జైలులో ఉన్న మాగుంట రాఘవరెడ్డికి ఇటీవల బెయిల్‌ లభించింది. జైలు నుంచి విడుదలైన ఆయన తొలిసారిగా గురువారం ప్రకాశం జిల్లాకు వచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ మాగుంట కుటుంబం గత నలభై, యాభై ఏళ్లుగా మద్యం వ్యాపారంలోనే ఉందని.. వారిపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలూ లేవన్నారు. భేటీలో బాలినేని ప్రణీత్‌రెడ్డి, సూపర్‌బజార్‌ ఛైర్మన్‌ తాతా ప్రసాద్‌ తదితరులున్నారు. రాఘవరెడ్డికి వల్లూరమ్మ దేవస్థానం వద్ద వైకాపా శ్రేణులు పూలతో స్వాగతం పలికారు. గజమాలలతో ఎంపీ మాగుంట, రాఘవరెడ్డిలను సత్కరించారు. ఆ తరవాత వారు ప్రదర్శనగా ఒంగోలులోని నివాసానికి చేరుకున్నారు.

*  తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్

ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపి జోరు కొనసాగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో సక్సెస్ ఫుల్ గా అధికారాన్ని చేజిక్కించుకుని ఊపుమీదున్న కాంగ్రెస్ తెలంగాణపై కన్నేసింది. తెలంగాణ ఏర్పాటుతర్వాత వరుసగా రెండుసార్లు గెలిచిన బిఆర్ఎస్ ను ఈసారి ఎలాగయినా ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ వర్కింగ్  కమిటీ (సిడబ్యూసి) మొదటి సమావేశం నిర్వహించాలని ఏఐసిసి నిర్ణయించింది. సెప్టెంబర్ 16న ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీకోసం కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తో పాటు జాతీయస్థాయి కీలక నాయకులు హైదరాబాద్ రానున్నారు. ఈ భేటీలో పాల్గొనే నాయకులతో భారీ బహిరంగ సభకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ఈ సభ ద్వారా ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం వెనక రాష్ట్ర కాంగ్రెస్ మరో వ్యూహం వున్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. దీన్ని విలీనంగా కాంగ్రెస్ పేర్కొంటుంటే, విమోచనంగా బిజెపి పేర్కొంటోంది. విలీనమో లేక విమోచన దినోత్సవమో గానీ ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులంతా హైదరాబాద్ లోనే వుండనున్నారు.కాబట్టి సోనియా గాంధీ ముఖ్య అతిథిగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది.  ఆ వేడుకల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాదు గతంలోనూ ఈ ప్రాంతాన్ని కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రజలకు వివరించే అవకాశం వుంటుందని ఆ పార్టీ భావిస్తోంది.ఇక తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే మరో మూడు రాష్ట్రాలు చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ బలంగా వుంది. చత్తీస్ ఘడ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ అధికారంలో వుంది. మధ్య ప్రదేశ్ లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ విజయం సాధించి లోక్ సభ ఎన్నికలకు తాము సిద్దమేనని ఘనంగా ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బలంగా వున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అయితే లోక్ సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ప్రత్యేకసమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుండి 22 వరకు అంటే ఐదురోజులు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సిడబ్ల్యూసి మీటింగ్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మీటింగ్ ను వాయిదా వేస్తారో లేక యధావిదిగా కొనసాగిస్తారో చూడాలి.