* ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం సరిహద్దులు దాటిన పాక్ యువకుడు
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం ఓ పాకిస్థానీ దేశ సరిహద్దులు దాటొచ్చాడు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు. అతని వ్యవహారం తొమ్మిది నెలల తర్వాత బయటపడింది. మరోవ్యక్తి పేరిట ఆధార్ కార్డు సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య గురువారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో ఉన్న ప్రకారం… పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా చెందిన ఫయాజ్ అహ్మద్(24) ఉపాధి కోసం 2018 డిసెంబరులో షార్జా వెళ్లాడు. అక్కడి సైఫ్‌జోన్‌లోని వస్త్ర పరిశ్రమలో పనికి కుదిరాడు. హైదరాబాద్ బహదూర్‌పుర ఠాణా పరిధిలోని కిషన్‌బాగ్‌కు చెందిన నేహ ఫాతిమా(29) సైతం ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. అక్కడి మిలీనియం ఫ్యాషన్ పరిశ్రమలో ఉద్యోగం పొందేందుకు ఫయాజ్ సహకరించాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్ వచ్చి కిషన్‌బాగ్‌లోని అసఫ్ బాబానగర్‌లో ఉంటోంది. ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం… ఫయాజ్‌ను సంప్రదించారు. హైదరాబాద్ రావాలని గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.వీసా, ఇతరత్రా ఎలాంటి గుర్తింపు లేకున్నా ఫయాజ్ 2022 నవంబరులో పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లాడు. జుబేర్ షేక్, అఫ్జల్ బేగం ఇద్దరూ నేపాల్‌లోని కాఠ్‌మాండూ వెళ్లి ఫయాజ్‌ను కలిశారు. కొందరి సాయంతో సరిహద్దులు దాటించి భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం కిషన్‌బాగ్‌లో అక్రమంగా ఆవాసం కల్పించారు. అతనికి ఆధార్ కార్డు ఇప్పించి స్థానికుడిలా నమ్మించేందుకు పథకం వేశారు. మాదాపూర్‌లో ఒక ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లి తమ కుమారుడు మహ్మద్ గౌస్ పేరిట రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు నకిలీ జనన ధ్రువపత్రం సమర్పించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని పాకిస్థాన్ పాస్‌పోర్టు గడువు ముగిసినట్లు తేలింది. జుబేర్, అఫ్జల్‌బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుణ్ని కౌంటర్ ఇంటలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు విచారించాయి. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటాడా.. కుట్రకోణం ఏమైనా ఉందా.. అని లోతుగా విచారిస్తున్నారు.
* పాకిస్థాన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఘర్షణ
పాకిస్థాన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఘర్షణ చోటు చేసుకుంది. వివాహ విందు సమయంలో అతిథులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.వివాహానికి హాజరైన అతిథులంతా విందు ఆరగించడం ప్రారంభించారు. అంతా ఎవరి టేబుల్స్ వద్ద వాళ్లు కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఇంతలో ఓ టేబుల్ వద్దకు వచ్చిన వ్యక్తి.. అక్కడ విందు ఆరగిస్తున్న అతిథి తలపై ఉన్న టోపీ (Hat)ని తీసేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణాల్లోనే అది పెద్ద గొడవకు దారి తీస్తుంది. అక్కడున్న వారు కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారిపోతాయి. ఒకరికొకరు కుర్చీలతో కొట్టుకోవడం మొదలు పెడతారు. ఇలా చాలాసేపు గొడవ కొనసాగుతుంది. చివరికి కొందరు అతిథులు కలుగజేసుకోవడంతో కొద్దిసేపటికి ఘర్షణ సద్దుమణుగుతుంది.ఆగస్టు 24వ తేదీ ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘నాకు తగినన్ని మాంసం ముక్కలు లభించకపోతే ఇలానే విసుగు చెందుతాను’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆరు నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వీక్షించారు.
* తెలుగు చిత్రపరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం
తెలుగు చిత్రపరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలు తీసుకొచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న ముగ్గుర్ని రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, నౌకాదళ మాజీ ఉద్యోగి బాలాజీ, రైల్వేశాఖ ఉద్యోగి మురళి ఉన్నారు. వెంకటరత్నారెడ్డి, బాలాజీలు తెలుగు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి రూ.32.89 లక్షల విలువైన 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, 11.5 గ్రాముల ఎక్స్టసీ మాత్రలు, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, రెండు కార్లు, అయిదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను టీఎస్‌న్యాబ్ పశ్చిమ విభాగం ఎస్పీ డి.సునీతారెడ్డి, డీఎస్పీ కె.నర్సింగ్‌రావు, ఇన్‌స్పెక్టర్ రాజేశ్ గురువారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన బి.బాలాజీ (34) నౌకాదళంలో పనిచేసేవాడు. డ్రగ్స్‌కు అలవాటుపడిన అతను మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్స్‌కు వచ్చి స్నేహితులతో పార్టీలు చేసుకునేవాడు. బెంగళూరు డ్రగ్స్ నెట్‌వర్క్‌లో కీలక సూత్రధారులైన నైజీరియన్లతో సంబంధాలు పెంచుకున్నాడు. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలు నిర్వహించేవాడు. తెలుగు చిత్రపరిశ్రమలో ముఖ్యులు, మరికొందరికి మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలోనే బాలాజీకి సినీ ఫైనాన్షియర్, గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన కె.వెంకటరత్నారెడ్డి (42)తో పరిచయం ఏర్పడింది. కిక్, బిజినెస్‌మేన్, ఢమరుకం, లవ్‌లీ, ఆటోనగర్ సూర్య తదితర చిత్రాలకు వెంకటరత్నారెడ్డి ఫైనాన్షియర్‌గా వ్యవహరించాడు. ఇతడు నగర శివార్లలో డ్రగ్స్, అమ్మాయిలతో పార్టీలు నిర్వహించేవాడు. బాలాజీకి పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పి డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చాడు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి (42) కూడా మాదకద్రవ్యాలకు అలవాటుపడి.. ఈ పార్టీలకు హాజరయ్యేవాడు.టీఎస్‌న్యాబ్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ బృందం రెండు నెలలుగా డ్రగ్ దందాపై నిఘా వేసింది. ఇటీవల అరెస్టయిన డ్రగ్స్ సరఫరాదారు, నైజీరియన్ ఒగ్బాగు డేవిడ్ ఉకా అలియాస్ పాస్టర్ డేవిసన్ అలియాస్ ఐవూ(58) లింకుల ఆధారంగా పోలీసులు కొన్ని వివరాలు రాబట్టి.. బుధవారం గుడిమల్కాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్స్‌లోని 804వ నంబరు ఫ్లాట్‌లో అర్ధరాత్రి ఒక యువతి, ఒక బాలికతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వెంకటరత్నారెడ్డి, మురళిలను అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ, వెంకటరత్నారెడ్డిలపై వ్యభిచారానికి సంబంధించిన కేసులున్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్లలో సమాచారం ఆధారంగా ముగ్గురు నైజీరియన్లు, విశాఖపట్నానికి చెందిన ఒకరు డ్రగ్స్ సరఫరాదారులని గుర్తించారు. 18 మంది డ్రగ్స్ వినియోగదారుల సమాచారం లభించగా.. వారిలో సినీ ప్రముఖులున్నట్లు తెలుస్తోంది. యువతికి, బాలికకు సినిమా అవకాశాలిప్పిస్తానని వెంకటరత్నారెడ్డి తీసుకొచ్చాడు.
* విశాఖలో సైకో భర్త కిరాతకం
భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. భార్యను జుట్టుపట్టుకుని రోడ్డుపైకి లాక్కువచ్చి అందరూ చూస్తుండగానే బ్లేడ్ తో ముఖం, మెడపై విచక్షణారహితంగా దాడిచేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె రోడ్డుపైనే పడిపోగా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. ఇలా సైకో భర్త చేతిలో భార్య నడిరోడ్డుపైనే చిత్రహింసలకు గురయిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ప్రసాద్, నీలిమ దంపతులు నివాసముండేవారు. ప్రసాద్ తల్లి ముత్యాలమ్మ కూడా ఇదే ఇంట్లో వుండేది. అయితే భర్తతో మనస్పర్ధల కారణంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన నీలిమ అరిలోవ ప్రాంతంలో ఒంటరిగా నివాసం వుంటోంది. ఇలా దూరంగా వున్నప్పటికి నీలిమపై భర్త, అత్త వేధింపులు కొనసాగాయి. తరుచూ ఆమెవద్దకు వచ్చి గొడవపడుతూ వుండేవారు. తాజాగా భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మ ఒంటరిగా వుంటున్న నీలిమ వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడికి దిగారు. భార్యను జుట్టుపట్టుకుని ఇంట్లోంచి బయటకు లాక్కువచ్చిన ప్రసాద్ నడిరోడ్డుపైనే దాడికి దిగాడు. వెంటతెచ్చుకున్న బ్లేడ్ తో భార్య ముఖం, మెడతో పాటు శరీరంపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఇలా కోడలిపై దాడిచేస్తున్న కొడుకుకు ముత్యాలమ్మ సహకరించింది.భర్త బ్లేడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన నీలిమను స్థానికులు హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త ప్రసాద్, అత్త ముత్యాలమ్మపై హత్యాయత్నం చేసు నమోదు చేసారు పోలీసులు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు అరిలోవ సీఐ సోమశేఖర్ తెలిపారు. ప్రస్తుతం నీలిమ హాస్పిటల్లో చికిత్ప పొందుతోంది. ఆమె ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని… పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు సమాచారం. ముఖం, మెడపై బ్లేడ్ గాట్లు నయం కావడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
* ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రముఖ మలయాళ సినీ, టీవీ నటి అపర్ణ నాయర్ (31) తిరువనంతపురంలోని తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. తిరువనంతపురంలోని కరమణలోని తన నివాసంలో గురువారం (ఆగస్టు 31) సాయంత్రం నటి అపర్ణ విగత జీవిగా కనిపించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నటి ఆగస్టు 31 రాత్రి 7 గంటల 30 నిముషాల సమయంలో చనిపోయినట్లు సమాచారం.సంఘటన జరిగిన సమయంలో మృతురాలి తల్లి, సోదరి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. అపర్ణ తన బెడ్ రూంలో ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటీన కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనిపై నటి తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరమన పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అపర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అపర్ణ కుటుంబ సభ్యులు ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించకపోవడంతో పోలీసులు అనుమానం మరింత బలపడుతోంది.
* మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నాకర్‌రెడ్డి విషయంలో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతడిపై వివిధ రకాల మోసాలకు సంబంధించి 25కు పైగా కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఐఆర్‌ఎస్ అధికారినంటూ వెంకట రత్నాకర్‌రెడ్డి పలు మోసాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరు సినీ నిర్మాతల నుంచి రూ.30లక్షలకు పైగా అతడు వసూలు చేశాడు. ఓ అధికారిని కూడా పెళ్లి పేరుతో ఆయన మోసం చేసినట్లు బయటపడింది. సినిమాల్లో అవకాశాల పేరిట యువతులకు వల వేస్తున్నట్లు వెల్లడైంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు వెంకట రత్నాకర్‌రెడ్డి మొబైల్‌ను పరిశీలిస్తున్నారు. అతడితో పరిచయాలు, సన్నిహితంగా ఉన్న వాళ్లను కేసు దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాలని భావిస్తు్న్నారు. ఎక్కడి నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చాడు? దీనికోసం ప్రత్యేకంగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నైజీరియన్లతో వెంకట్‌కు ఉన్న సంబంధాలు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడు నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు హాజరైన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. కొకైన్, ఎల్‌ఎస్‌డీ, గంజాయితతో పాటు ఇంకా ఏ తరహా డ్రగ్స్‌ను వెంకట్ తాను నిర్వహించే పార్టీల్లో ఉపయోగించేవాడనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
* తుపాకీతో హాస్పిటల్లో చొరబడి వ్యక్తిపై కాల్పులు
అది ఓ ఆస్పత్రి. ఒక వార్డులో చికిత్స కోసం వచ్చిన రోగులు, అటెండెంట్‌లు వైద్యుల కన్సల్టేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆస్పత్రిలో చొరబడ్డాడు. వచ్చీరావడంతోనే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మరో వ్యక్తి దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా పరుగందుకున్నాడు. వెంబడించినా దొరకలేదు.తూటా తగిలిన వ్యక్తికి వైద్యులు వెంటనే చికిత్స చేశారు. ప్రస్తుతం అతడికి ఎలాంటి అపాయం లేదని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు హాస్పిటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
* ఆర్టిసి బస్సు ఢీకొని యాచకురాలు దుర్మరణం
రోడ్డు దాటుతుండగా ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బిచ్చగత్తె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ సమీపంలో బిక్షమెత్తుకునే ఎంకవ్వ రోజూ మాదిరిగానే ఇవాళ కూడా అక్కడికి వచ్చింది. అయితే రోడ్డు దాటే క్రమంలో ఆమెను బస్సు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఎంకవ్వ ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని ఎంకవ్వ మృతదేహాన్ని పరిశీలించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన బస్సును, డ్రైవర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది సైనికులు చనిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని గురువారం ఆత్మాహుతి బాంబర్ మోటార్‌సైకిల్‌పై వెళ్లినట్లు భద్రతా అధికారులు తెలిపారు. 2022 నుంచి భద్రతా బలగాలపై పాకిస్థానీ తాలిబాన్ దాడులను తీవ్రతరం చేసిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.వివరాల్లోకెళ్తే.. పెషావర్, ఏపీ: పాకిస్థాన్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది సైనికులు మరణించారు. ఈ దాడిలో మరో ఇరవై మంది జవాన్లు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో గురువారం ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడి చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ తాలిబన్లే అని అనుమానిస్తున్నారు.2022 నుంచి భద్రతా బలగాలపై పాకిస్థానీ తాలిబాన్ దాడులను తీవ్రతరం చేసింది. పాకిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ నుండి ఒక ప్రత్యేక సమూహం. ఈ విషయంపై పాక్ సైన్యం ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.బన్నూ నార్త్ వజీరిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ మరోసారి నిర్వహిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతం నుండి ఈ బృందాన్ని పూర్తిగా తొలగించాలని ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్న దాడి పాకిస్తాన్ సైన్యం పాత ప్రకటనపై ప్రశ్నలను లేవనెత్తింది.
* అపార్ట్మెంట్ సెల్లార్‌లో భారీ అగ్ని ప్రమాదం
అగ్ని ప్రమాదంలో 9 బైకులతో పాటు ఒక కారు కాలిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటన డైరీ ఫామ్ చౌరస్తా సమీపంలో గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ సెల్లార్లో జరిగింది. అపార్ట్మెంట్ సెల్లార్ లో ఉండే వాచ్మెన్ కుటుంబం రాఖీ పండుగ వేడుకలకు తమ స్వగ్రామానికి వెళ్ళింది. శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో సెల్లార్లో నిలిపి ఉంచిన తొమ్మిది బైకులతో పాటు ఒక కారు కాలిపోయింది. వాచ్మెన్ రూమ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారీగా మంటలు వ్యాపించడంతో సీసీ కెమెరాలు కూడా కాలిపోయినట్లు సమాచారం.