ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా (Motorola) జీ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో జీ84 5జీ (Moto G84 5G) పేరుతో మూడు రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 50 ఎంపీ ప్రధాన కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇక ధర, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటో జీ84 5జీ (Moto G84 5G) ఫోన్ సింగిల్ వేరియంట్‌లో వస్తోంది. 12జీబీ+ 256జీబీ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. వివా మెజెంటా, మార్ష్‌మల్లో బ్లూ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. సెప్టెంబరు 8 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా లేదా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజీ ఆఫర్ సాయంతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.
మోటో జీ84 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ pOLED డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో మూడు కెమెరాలు ఇచ్చారు. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ కెమెరా, సెల్ఫీ కోసం ముందు వైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యూఎస్‌బీ టైప్-సితో వస్తోంది. NFC సదుపాయం ఉంది.