Agriculture

మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

రాష్ట్రంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శుక్రవారం ప్రకటించింది. 20 జిల్లాలకు పసుపు (ఎల్లో) రంగు హెచ్చరికలు జారీచేసింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ‘ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయి’ అని వాతావరణశాఖ హైదరాబాద్‌ సంచాలకురాలు కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉదయం వేళ పొగమంచు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు.

3, 4, 5 తేదీల్లో వానలు కురిసే జిల్లాలు..
ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కొత్తగూడెం.