ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 350ని (Royal enfield bullet 350cc 2023) మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను కంపెనీ రూ.1,73,562 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. మూడు వేరియంట్లలో వస్తున్న ఈ మోటార్ సైకిల్ బుకింగ్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. డెలివరీలు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి.
2023 కొత్త బుల్లెట్ 350 మూడు వేరియంట్లలో వస్తోంది. మిలటరీ వేరియంట్ ధర రూ.1.73 లక్షలు (Royal enfield bullet 350cc 2023 price) కాగా.. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1.97 లక్షలుగా కంపెనీ పేర్కొంది. గోల్డ్ వేరియంట్ ధర్ రూ.2.15 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ జె-సిరీస్ ఇంజిన్ అమర్చారు. ఇది 20 హెచ్‌పీ పవర్‌ను, 27 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 350లో హెడ్‌లైట్, టెయిల్ లైట్‌ను అధునాతనంగా తీర్చిదిద్దారు. హ్యాండిల్‌బార్‌లో సైతం మార్పులు చేశారు. ఇందులో ఎల్‌సీడీ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ అనలాగ్ ఇన్సుట్రమెంట్ క్లస్టర్ ఇచ్చారు. సర్వీస్ అలర్ట్, ఓడోమీటర్ రీడింగ్, ఎకో ఇండికేటర్, ఫ్యూయల్ లెవల్ వంటివి డిజిటల్‌గా చూపిస్తాయి. ఎంట్రీలెవల్ వేరియంట్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్ ఇచ్చారు. వెనువైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అదే స్టాండర్డ్, హయ్యర్ వేరియంట్లలో డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌తోపాటు, వెనుకవైపు డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350ని విక్రయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా Hness CB350, జావా 42 బైకులకు కొత్త బుల్లెట్ 350 పోటీ ఇవ్వనుంది