Business

తెలంగాణ అప్పు 20,637.23 కోట్లు

తెలంగాణ అప్పు 20,637.23 కోట్లు

తెలంగాణ(telangana)లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2023-24)లో మొదటి నాలుగు నెలల్లోనే 20 వేల కోట్ల రూపాయలు అప్పులు(debts) చేసినట్లు కాగ్ నివేదిక(CAG report) స్పష్టం చేసింది. 2023-24 మొదటి 4 నెలల్లో ప్రభుత్వం రూ.20,637.23 కోట్ల రుణాలను తీసుకుందని పేర్కొంది. ఇది గత ఏడాది కంటే 99.56 శాతం ఎక్కువ అని చెప్పింది. ఈ రుణాలు తీసుకున్నట్లు తాజాగా జూలై నెలవారీ నివేదికలో కాగ్ వెల్లడించింది. మరోవైపు జూన్‌ నెలతో పోలిస్తే జులైలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం రూ.640 కోట్లు తగ్గినట్లు తెలిపింది. ఈ క్రమంలో రుణాలు భారీగా తీసుకున్నట్లు చెప్పింది.

ప్రస్తుత సంవత్సరం తెలంగాణ బడ్జెట్‌ రూ.2.59 లక్షల కోట్లు అంచనా వేశారు. అందులో ఇప్పటివరకు రూ.67,494.73 కోట్లు వచ్చాయి. ఇందులో రూ.20,637.23 కోట్లు రుణాల రూపంలో తీసుకున్నారు. రాష్ట్ర ఆదాయంలో కీలక భాగమైన పన్నుల(taxes) ద్వారా వచ్చే ఆదాయం వార్షిక లక్ష్యం రూ.1.52 లక్షల కోట్లలో 28.01 శాతం (రూ. 42,712.27 కోట్లు) వచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది మొత్తం వ్యయం రూ.2.49 లక్షల కోట్లుగా అంచనా వేయగా, జూలై వరకు రూ.63,607.91 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కింద రూ.41,259.17 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 5.62 శాతం (రూ.2317.82 కోట్లు) వచ్చాయి.

మరోవైపు ఉద్యోగుల జీతాల కోసం రూ.13,686.99 కోట్లు, గతంలో తీసుకున్న రుణాల వడ్డీల కోసం రూ.7174.70 కోట్లు, పింఛన్ల కోసం రూ.5461.89 కోట్లు, పలు స్కీంల రాయితీల కోసం రూ.3,424 కోట్లు, రెవెన్యూ వ్యయం కింద రూ.20,556.11 కోట్లు, మూలధన వ్యయం కోసం రూ.13,074 కోట్లు ఖర్చు(expenses) చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ ఆర్థిక ద్రవ్యలోటు రూ.56,062.94 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.