యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ను ప్రింట్ చేయొద్దని వాటికి నిర్దేశించింది. ఇకపై సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్ ను ప్రింట్ చేయడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. సర్టిఫికెట్లపై ప్రింట్ చేయడం ద్వారా విద్యార్థుల ఆధార్ నంబర్‌ను పబ్లిక్‌గా బహిర్గతం చేయకూడదని పేర్కొంటూ యూజీఏసీ సెక్రెటరీ మనీష్ జోషి విశ్వవిద్యాలయాలకు లేఖ రాశారు.
డిగ్రీలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్ల మీద ఆధార్ నంబర్లు ప్రింట్ చేస్తే, వాటిని ఆమోదించమని స్పష్టం చేశారు. ఆధార్ ప్రాధికార సంస్థ (యూఏడీఏఐ) జారీ చేసిన నిబంధనలను ఉన్నత విద్యా సంస్థలు ఖచ్చితంగా అనుసరించాలని సూచించారు. ‘‘అడ్మిషన్లు, రిక్రూట్‌మెంట్ల విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు అభ్యర్థులు డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబర్లను ప్రింట్ చేస్తున్నాయి. ఇది సరికాదు’’ అని యూజీసీ తేల్చిచెప్పింది.