Business

కూరగాయల ధరలు తగ్గుముఖం

కూరగాయల ధరలు తగ్గుముఖం

తెలంగాణలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. నెలన్నర రోజుల క్రితం కిలో రూ.200 ఉన్న టమాటా ధర… ఇప్పుడు రైతు బజార్లలో రూ.15 ఉంది. బహిరంగ మార్కెట్లలో రూ.20, మాల్స్‌లో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి ధర గతంలో రూ.200 దాటగా.. ఇప్పుడు అది రైతుబజార్లలో కిలో రూ.25కి లభిస్తోంది. పంటలు చేతికిరావడంతో పాటు మార్కెట్లకు సరకు పోటెత్తడంతో కూరగాయలు మళ్లీ చౌకగా దొరుకుతున్నాయి.

భారీగా పెరిగి…
వేసవిలో అకాల వర్షాలు, ఆ తర్వాత జూన్‌ నెలలో వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో జూన్‌ రెండోవారం నుంచి రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మొదట్లో టమాటా ధర పెరగగా తర్వాత మిగిలిన కూరగాయల ధరలపైనా ఆ ప్రభావం పడింది. జూన్‌ మూడో వారంనాటికి టమాటా కిలో రూ.100 దాటింది. క్రమేపీ అది రూ.200కు చేరుకుంది. ఆగస్టు రెండోవారం వరకు ఆ ధర అలాగే ఉంది. తరువాత నుంచి తగ్గుదల మొదలైంది. ప్రస్తుతం రూ.15కు చేరింది. రైతు బజార్లలో వంకాయ కిలో రూ.18, బెండ రూ.23, బీర రూ.18, కాకర రూ.23, దొండ రూ.18, బీన్స్‌ రూ.35, కాలిఫ్లవర్‌ రూ.18, ఉల్లి రూ.21, క్యాబేజీ రూ.13, ఆలుగడ్డ రూ.21, కీర రూ.13 చొప్పున లభిస్తున్నాయి.

చేతికొస్తున్న పంటలు…
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మెదక్‌, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున కూరగాయలు ఉత్పత్తవుతున్నాయి. హైదరాబాద్‌లోని మెహిదీపట్నం మార్కెట్‌కు రోజూ 80 క్వింటాళ్లు, ఎర్రగడ్డ మార్కెట్‌కు 110 క్వింటాళ్ల టమాటాలు వస్తున్నాయి. ఇతర కూరగాయలు 1100 టన్నులకు పైగా వస్తున్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ మార్కెట్లకు టమాటాల రాక పెరిగింది. ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని మొహదీపట్నం రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి విజయ్‌కుమార్‌ తెలిపారు.