కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్ టీపీ విలీనంపై అధినేత్రి షర్మిల క్లారిటీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాటల్లో వైఎస్ కుటుంబంపై ఉన్న గౌరవం కనిపించిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిలబడి.. తనను నమ్ముకున్న కార్యకర్తలనూ నిలబెడతానని చెప్పారు. ఎవర్నీ రోడ్డుమీద వదిలేసి వెళ్లబోనని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలంతా బాగుపడాలన్నదే నా ప్రయత్నం అని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపడమే తన లక్ష్యమన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో వైఎస్‌ఆర్ పేరుపై సోనియా గాంధీ క్లారిటీ ఇచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదని సూచించారు.కాగా, నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వైఎస్సార్టీపీ పార్టీ నేత కొండా రాఘవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌లో పాల్గొన్న కొండా రాఘవ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఊహించని కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ మాకు అనుమానాలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వెళుతున్నారని ఆగ్రహించారు. దీంతో తాజాగా.. కొండాకు పరోక్షంగా షర్మిల కౌంటర్ ఇచ్చారు.