Politics

దండా నాగేంద్ర అరెస్టును ఖండించిన చంద్రబాబు

దండా నాగేంద్ర అరెస్టును ఖండించిన చంద్రబాబు

పల్నాడు జిల్లా ధరణి కోటకు చెందిన దండా నాగేంద్ర అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ పెద్దల దోపిడీపై ఎన్జీటీలో కేసులు వేసినందుకే.. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనని మండిపడ్డారు. నాగేంద్ర కేసు కారణంగానే ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ చర్యలకు దిగి, తవ్వకాలు నిలిపివేసిందన్నారు. దీంతో ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించే చర్యలు మొదలు పెట్టిందని మండిపడ్డారు. ఇసుక అక్రమ తవ్వకాలతో సీఎం జగన్, వైకాపా నేతలు రూ.40 వేల కోట్ల దోచేసిన విషయం ఆధారాలతో బయటపెట్టామన్నారు. దానికి సమాధానం చెప్పకుండా అరెస్టులకు దిగడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు. నాగేంద్రను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ప్రజలే ఇసుక డంపుల్లో పాతి పెడతారు..అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తే అక్రమ కేసులు పెడతారా? అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. నాగేంద్రను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాజమండ్రిలో ఇసుక రవాణా అడ్డుకున్న దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేశారన్నారు. ఇప్పుడు నాగేంద్రను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా తీరు మారకపోతే ప్రజలే ఇసుక డంపుల్లో వైకాపాను పాతి పెడతారని అచ్చెన్న దుయ్యబట్టారు.