కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ప్రారంభించి.. ఈ నెల7వ తేదీన ఏడాది పూర్తి అవుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దేశంలోని అన్ని జిల్లాలో ఈ నెల 7వ తేదీన భారత్ జోడో యాత్రలు చేపట్టాలని శ్రేణులను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారత్ జోడో యాత్రలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.
కాగా, గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ఎంపీ రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి ఈ యాత్ర మొదలు పెట్టిన రాహుల్ గాంధీ.. 145 రోజుల్లో సుమారు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అన్ని వాతావరణ పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని రాహుల్ జనంతో మమేకమయ్యారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ఈ భారత్ జోడో యాత్రతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి మైలేజ్ వచ్చింది. భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో ఈ సంబురాలను నిర్వహించాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ యాత్ర స్టార్ట్ చేసిన సెప్టెంబర్ 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారత్ జోడో యాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.