Politics

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం: రేవంత్‌ రెడ్డి

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం: రేవంత్‌ రెడ్డి

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే భాజపా జమిలి ఎన్నికల ప్రస్థావన తెస్తోందని విమర్శించారు.

‘‘కొద్దిరోజులుగా దేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతం భాజపా మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కర్ణాటకలో గల్లీగల్లీ తిరిగినా.. ప్రధాని మోదీ, అమిత్‌షా 30 రోజులు ప్రచారం చేసినా భాజపా గెలవలేదు. మణిపుర్‌ అంశంపై పార్లమెంట్‌లో మోదీ నోరెత్తలేదు. మణిపుర్‌పై చర్చించుకుండా ప్రజలను పక్కదారి పట్టించారు. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపని సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తున్నాయని తేలింది. భారాసకు 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది.భాజపాకు ఓటమి తెలిసే తెరపైకి వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ తీసుకొస్తుంది. ‘ఇండియా’ కూటమి జమిలి ఎన్నికలకు వ్యతిరేకం. జమిలి ఎన్నికల కమిటీ సభ్యుడిగా అధీర్‌ రంజన్‌ వైదొలిగారు. భాజపా, భారాస ఒకే తాను ముక్కలు. దీనికి భారాస అనుకూలంగా ఉంది. జమిలి ఎన్నికలకు సమ్మతి తెలుపుతూ 2018లో సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ తీసుకురావాలని చూస్తున్నారు. అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది’’ అని రేవంత్‌ ఆరోపించారు.