ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హెచ్చరికలు చేశారు. బాధ్యతారహిత ఆర్థిక విధానాలు (Financial policies), ప్రజాకర్షక చర్యలు (Populist measures) ఇచ్చే రాజకీయ ప్రయోజనాలు స్వల్పకాలమేనని.. దీర్ఘకాలంలో మాత్రం సామాజిక, ఆర్థికపరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు. జీ20 సదస్సు (G20 Summit) వేళ పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ రుణసంక్షోభంపై అడిగిన ఓ ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. దేశంలో ఎన్నికల వాతావరణం, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రజాకర్షక పథకాల హామీలు ఇస్తున్న సమయంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.చీఫ్ సెక్రటరీల జాతీయ సదస్సు సహా ఆయా వేదికలపై ఇదే విషయాన్ని స్పష్టం చేశాను. బాధ్యతారహిత ఆర్థిక విధానాలు, ప్రజాకర్షక కార్యక్రమాలు స్వల్పకాలంలో రాజకీయ ఫలితాలు ఇవ్వొచ్చు. కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక మూల్యానికి దారితీస్తాయి. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు లేదా ఇప్పటికే దాన్నుంచి బయటపడిన దేశాలు.. ఆర్థిక క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాయి. అందుకే రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
భారత్ అభివృద్ధి గమనాన్ని ఎన్నో దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘సంస్కరణలు, వాటి అమలు, మార్పు’ ఆధారిత రోడ్‌మ్యాప్ వల్లే ఇది సాధ్యమవుతోందన్నారు. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘ కాలంగా భారత్ పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉండేదని.. కానీ, వలసవాదం వల్ల ప్రపంచ వేదికపై అది వెనకబడిపోయిందన్నారు. ప్రస్తుతం భారత్ పురోగమిస్తోందని.. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు