తెలంగాణకు సంబంధించిన FLS మంజూరైన ప్రాజెక్టుల్లో.. మొదటిది దశాబ్దాలుగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల ఆకాంక్షలను పూర్తిచేయనుంది. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజాంపేట్, సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరు వరకు ఈ రైలు మార్గం ఉంటుంది. ఉత్తర తెలంగాణను ఇటు హైదరాబాద్‌తోనూ, ముంబై తోనూ, అటు నాగ్‌పూర్ మీదుగా దేశరాజధాని ఢిల్లీతో ఈ మార్గం అనుసంధానం చేస్తుంది. ఇది ఈ రెండు పాత జిల్లాల చిరకాల కోరిక. ఉత్తర తెలంగాణలో లైఫ్ లైన్ గా ఈ ప్రాజెక్ట్ మారుతుందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధితోపాటుగా వ్యవసాయ ఉత్పత్తులను రైతులు మార్కెట్‌కు తరలించేందుకు వీలవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 317 కి.మీ. అంచనా వ్యయం సుమారు: రూ. 5,706 కోట్లు.
రెండో మెగా ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది. పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి.. కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల్‌కు ఈ ప్రాజెక్టు అనుసంధానం అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలన్నీ ఈ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు ద్వారా అనుసంధానం అవుతాయి. రైతుల మేలు కోసం కాటన్ ఎగుమతికి, బియ్యం రవాణాకు, గ్రానైట్ తరలింపునకు.. ఈ లైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను కలపడం ద్వారా వాణిజ్య అవసరాలకు కూడా ఈ రైల్వే లైన్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు: 296 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.5,330 కోట్లు.
మూడో కీలకమైన ప్రాజెక్టు కాచిగూడ (ఉందానగర్) నుంచి జగ్గయ్యపేట రంగారెడ్డి జిల్లా మీదుగా.. చిట్యాల, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, జగ్గయ్యపేట నియోజకర్గాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. 65వ నెంబరు జాతీయ రహదారికి (విజయవాడకు వెళ్లే) సమాంతరంగా ఈ ప్రాజెక్టు ఉంటుంది. అంతేకాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతిలను కలిపే అతి తక్కువ దూరం కలిగిన రైల్వే మార్గం ఇది కాబోతున్నది. ఈ ప్రాంతంలో ప్రజారవాణాకు, వాణిజ్య అవసరాలకు ముఖ్యంగా.. సిమెంట్ ప్లాంట్లకు కొత్త లైన్ ద్వారా చాలా లబ్ధి జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పొడవు: 228 కి.మీ, అంచనా వ్యయం సుమారు: రూ.4,104 కోట్లు.