Business

ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు-TNI నేటి వాణిజ్య వార్తలు

ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు-TNI నేటి వాణిజ్య వార్తలు

* ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు

జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్‌లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. G20 సమ్మిట్‌కు అవసరమైన భద్రతా ఏర్పాట్ల గురించి DCP (మెట్రో) రామ్ గోపాల్ నాయక్ శనివారం DMRC చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు లేఖ రాశారు.దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. దేశ రాజధానిలోని 39 మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. అందులో మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్‌లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు.ఢిల్లీలో మిగిలిన స్టేషన్లు సాధారణంగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 4-13 వరకు స్మార్ట్ కార్డ్ సేవలను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఈ సేవలు ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశాల దృష్ట్యా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఇప్పటికే ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ 7 – 11 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (IGIA) ప్రయాణించే ప్రజలు మెట్రోను ఉపయోగించాలని సూచించారు.

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచే సానుకూలంగా మొదలైన సూచీలు మిడ్-సెషన్‌కు ముందువరకు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, దేశీయ ఆర్థిక గణాంకాల ప్రభావంతో తిరిగి లాభాల బాట పట్టాయి. చైనా ఉద్దీపన ప్రకటనలతో అక్కడి స్థిరాస్తి కంపెనీల షేర్లలో ఉత్సాహం కనిపించింది. వీటితో పాటు భారత ఈక్విటీల్లో విదేశీ నిధులు కొనసాగడం మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచింది.దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 240.98 పాయింట్లు లాభపడి 65,628 వద్ద, నిఫ్టీ 93.50 పాయింట్లు పెరిగి 19,528 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు మాత్రమే బలహీనపడ్డాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాలు 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విర్పో, హెచ్‌సీఎల్ టెక్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.82.69 వద్ద ఉంది.

*  8న ఈఎంఎస్‌ ఐపీఓ

 మంచినీరు, మురుగు నీరుకి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే ఈఎంఎస్‌ లిమిటెడ్‌ ఐపీఓ (EMS Ltd IPO) సెప్టెంబరు 8- 12 మధ్య జరగనుంది. ఒక్కో షేరు ధరను కంపెనీ సోమవారం రూ.200- 211గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.321 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ (EMS Ltd IPO)లో రూ.146.24 కోట్లు విలువ చేసే తాజా షేర్లు అందుబాటులో ఉన్నాయి. ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)’ కింద మరో 82.24 లక్షల షేర్లు ప్రమోటర్‌, వ్యవస్థాపకుడు రామ్‌వీర్‌ సింగ్‌ విక్రయిస్తున్నారు.ఈ ఐపీఓ (EMS Ltd IPO) ద్వారా సమీకరించిన నిధులను నిర్వహణ మూలధనం సహా సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ఈఎంఎస్‌ లిమిటెడ్‌ తెలిపింది. మురుగు, నీటి శుద్ధి ప్లాంట్‌లను నిర్మించడానికి నెట్‌వర్క్‌ను నిర్మించడంతో  సహా ఇతర సంబంధిత ప్రాజెక్టులను కంపెనీ చేపడుతుంటుంది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈ కంపెనీ ప్రాజెక్టులు చేపడుతోంది. గత 13 ఏళ్లలో ఈ కంపెనీ 67 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రస్తుతం 18 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి విలువ రూ.1,775 కోట్లు.

యూట్యూబ్‌కి ఎసరు పెడుతున్న యూట్యూబ్ షార్ట్స్

 టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రమ్ రీల్స్‌కు పోటీగా యూట్యూబ్ తీసుకువచ్చిన షార్ట్ వీడియోస్ ‘యూట్యూబ్ షార్ట్స్’ అనతి కాలంలోనే చాలా ఆదరణ పొందాయి. అయితే ఇది యూట్యూబ్ వ్యాపారాన్నే దెబ్బతీసేలా తయారైంది. కోట్లాది రూపాయల వ్యాపారాని ఈ షార్ట్స్ గండికొడుతున్నాయిని ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2020లో భారతదేశంలో యూట్యూబ్ షార్ట్స్ అనే షార్ట్ వీడియో ఫీచర్నిని ప్రవేశపెట్టింది. ఆ తరువాత 2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ ఫీచర్ విపరీతమైన ఆదరణ పొందింది.అనతికాలంలోనే మంచి రెస్పాన్స్ రావడంతో సంస్థ ఆదాయం పెరుగుతుందని భావించింది. అయితే కాలక్రమంలో దీని వల్ల సంస్థకు ప్రధాన ఆదాయంగా ఉన్న లాంగ్ వీడియోలపై ప్రభావం పడుతోందని యూట్యూబ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. షార్ట్ వీడియోల వల్ల లాంగ్ వీడియోల వ్యాపారానికి ప్రమాదం తెస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి.టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పరిచయం చేసిన తర్వాత యూట్యూబ్ కూడా షార్ట్స్ ప్రారంభించింది. ఇది ప్రారంభం అయిన తర్వాత ప్రేక్షకుల జనాదరణ పొందింది. యూట్యూబ్ ఆదాయం ప్రకటన నుంచే వస్తుంది. ఈ ప్రకటనలు లాంగ్ వీడియోలోనే ఉంటాయి. షార్ట్ వీడియోల్లో ప్రకటనలను అనుమతించదు. ప్రేక్షకులు కూడా షార్ట్ వీడియోలకు ఎక్కువగా అలవాటు పడటం, దీంతో ఆదాయం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది తమ కంటెంట్ ని షార్ట్ వీడియోల రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు.2020లో తొలిసారి తన త్రైమాసిక క్షీణతను చూసింది. తరువాత త్రైమాసికాల్లో కూడా మునుపటి కాలంతో పోలిస్తే క్షీణతను చవిచూసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ఆదరణ పొందిన యూట్యూబ్ షార్ట్స్ ని సంస్థ తీసేసే అవకాశం లేదు. అయితే రాబడి కోసం యూట్యూబ్ ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషించే అవకాశం లేకపోలేదని బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

నేడు స్థిరంగా ఉన్న బంగారం ధరలు

నేడు అనగా సోమవారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి మీద ధరను పోల్చి చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,220 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,200,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,220.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 55,200,24 క్యారెట్ల బంగారం ధర – రూ 60,220.

*  మరింత పతనమైన టమాటా ధర

టమోటా.. 20 రోజుల క్రితం వరకు రైతులకు కాసుల పంట కురిపించింది. ఇప్పుడు అదే రైతుకు కంటతడి పెట్టిస్తోంది. జూన్ జూలై నెలలో అమాంతంగా పెరిగిన టమోటా ధరలు ఆగస్టు 11 వరకు ఊహకందని ధరలతో రైతును కోటీశ్వరుడిని చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ పలకడంతో సాగు చేసిన టమోటా ను పంటను కాపలా కాయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితికి తలెత్తింది. కానీ అంతలోనే సీన్ మారాపోయింది. సరిగ్గా 20 రోజులు గడిచేసరికి కొండెక్కిన టమాటా కాస్త.. నేల చూపులు చూస్తోంది. జూలై నెల ఆఖరు వరకు 196 రూపాయిల వరకు కిలో ధర పలికిన టమోటా ఇప్పుడు ఏకంగా కిలో 7 రూపాయలకు పడిపోయింది. మదనపల్లి టమాటా మార్కెట్లో టన్నుల కొద్దీ పంట వస్తుండటం.. ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడంతో టమాటా రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. 20 రోజుల క్రితం వరకు మదనపల్లి మార్కెట్ కు టమోటాలు తీసుకొచ్చి జేబునుండా డబ్బులు తీసుకెళ్లిన టమోటా రైతు ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది.

 రెండు లక్షల పెట్టుబడి ద్వారా ప్రతి నెలా లక్ష పొందవచ్చు

చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక చాలా మంది సొంతంగా బిజినెస్ లు చేస్తుంటారు.. అలా బిజినెస్ లు చెయ్యాలనుకొనేవారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. అందులో కేవలం రెండు లక్షల పెట్టుబడి ద్వారా ప్రతి నెలా లక్ష రూపాయలను పొందవచ్చు.. అమూల్ డెయిరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. అమూల్ పాల వ్యాపారం కోసం ఎవరైనా సరే ఫ్రాంచైజీని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న దాని స్వంత కస్టమర్ బేస్ కాకుండా, అమూల్ ప్రతి నగరంలో దాని స్వంత అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. మీరు అమూల్ ఫ్రాంచైజీని ఎలా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..అమూల్ కంపెనీ బిజినెస్ గురించి తెలుసుకోవాలని అనుకొనేవారు ముందుకు అధికార వెబ్సైట్ ( https://amul.com/m/amul-franchise-business-opportunity) ను సందర్శించాలి.. కంపెనీ అందిస్తుంది. మొదటి పద్ధతిలో, ఒక వ్యక్తి అమూల్ ఇష్టపడే అవుట్‌లెట్, అమూల్ రైల్వే పార్లర్, అమూల్ కియోస్క్ కోసం ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటే, దాదాపు రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడికి నాన్-రిఫండబుల్ బ్రాండ్ సెక్యూరిటీగా రూ. 25 వేలు, రినోవేషన్‌పై రూ. 1 లక్ష మరియు పరికరాలపై రూ. 75 వేలు ఖర్చు అవుతుంది..అదే విధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కోసం 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి: మరో విధంగా ఫ్రాంచైజీని పొందాలంటే దాదాపు రూ.6 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో బ్రాండ్ సెక్యూరిటీ రూ.50 వేలు, రినోవేషన్ రూ.4 లక్షలు, పరికరాల కోసం రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టవచ్చు…ఇక ఆదాయం విషయానికొస్తే.. అమూల్ ఉత్పత్తుల ధరల పై ఆధారపడి ఉంటుంది.. మిల్క్ పౌచ్‌పై 2.5 శాతం, పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్‌క్రీమ్‌పై 20 శాతం రాబడిని పొందవచ్చు. రెసిపీ ఆధారిత ఐస్ క్రీం, షేక్, పిజ్జా, శాండ్‌విచ్, హాట్ చాక్లెట్ డ్రింక్‌పై సగటున 50 శాతం రాబడిని, ముందుగా ప్యాక్ చేసిన ఐస్‌క్రీమ్‌పై 20 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది.. ఇక రాబడిని బట్టి రూ. 50 వేల నుంచి రూ. లక్ష రూపాయల వరకు ఉంటుంది.. మీకు ఈ బిజినెస్ నచ్చితే ట్రై చెయ్యండి..

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. అలాగే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించి సామాన్యులకు గుడ్ న్యూస్ తెలిపారు. అయితే నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్: రూ. 955,వరంగల్: రూ.974,విశాఖపట్నం: రూ.912,విజయవాడ: రూ.927,గుంటూర్: రూ.944

పెరిగిన సోలార్ ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌లు

ప్రస్తుత సంవత్సరం జనవరి–-జూన్ కాలంలో దేశంలో రూఫ్‌‌‌‌టాప్ సోలార్ ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌లు 3.2 శాతం పెరిగి 872 మెగావాట్లకు చేరుకున్నాయని మెర్కామ్ ఇండియా తెలిపింది.  2022 మొదటి అర్ధభాగంలో (హెచ్​1) భారతదేశంలో 845 మెగావాట్ల సోలార్​ రూఫ్​టాప్ ఇన్​స్టాలేషన్లు పూర్తయ్యాయని ఈ పరిశోధనా సంస్థ వెల్లడించింది.  క్యుములేటివ్ రూఫ్‌‌‌‌టాప్ సోలార్​ కెపాసిటీ జూన్ 2023 చివరి నాటికి 9.6 గిగావాట్లకు చేరుకుందని  మెర్‌‌‌‌కామ్  రిపోర్ట్  పేర్కొంది. రెండవ క్వార్టర్​లో 387 మెగావాట్ల రూఫ్​టాప్​ఇన్​స్టాలేషన్లు పూర్తయ్యాయి. ఇది ఈ ఏడాది జనవరి–-మార్చితో పోలిస్తే 20 శాతం ఎక్కువ. గత   ఏప్రిల్–-జూన్  కంటే 0.5 శాతం తగ్గింది. “రూఫ్‌‌‌‌టాప్ సోలార్ ఇండస్ట్రీ హెచ్​1లో అంచనాలను అందుకోలేకపోయింది. డిమాండ్​ పెరిగినప్పటికీ  ధరలు పెరిగినప్పటికీ  ఇలా జరిగింది. హెచ్​2లో మాత్రం మెరుగైన మార్జిన్‌‌‌‌ల కోసం ఇన్‌‌‌‌స్టాలర్లు ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌లను పెంచారు. చాలా వేగంగా డిమాండ్‌‌‌‌ను అందుకున్నారు ” అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్  సీఈఓ రాజ్ ప్రభు అన్నారు. రెసిడెన్షియల్​  కన్జూమర్ల  ఇన్​స్టాలేషన్లు 54 శాతం, పారిశ్రామిక వినియోగదారులవి 25 శాతం,  వాణిజ్య వినియోగదారులవి 21 శాతం ఉన్నాయి. ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ , ఆటోమొబైల్  ఆటో కాంపోనెంట్ సెక్టార్‌‌‌‌లలో ఇండస్ట్రియల్​ ఇన్​స్టాలేషన్లు ఎక్కువగా ఉన్నాయి. క్యుములేటివ్ రూఫ్‌‌‌‌టాప్ సోలార్ ఇన్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌లలో గుజరాత్ మొదటిస్థానంలో ఉంది. మహారాష్ట్ర  రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని మెర్కామ్​ తెలిపింది.