Politics

హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎన్నికల నగారా మోగించింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలను ఈనెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రంలో మోహరిస్తోంది. హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాలు ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని 17న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్న అయిదు ప్రధాన ఎన్నికల వాగ్దానాలను అందులో ప్రకటించనుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం దిల్లీలో వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మరో ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సీడబ్ల్యూసీ సమావేశాలను ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే నిర్ణయించారు. తొలిరోజు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు. మరుసటి రోజు జరిగే విస్తృతస్థాయి సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నాయకులు, పార్లమెంటరీ పార్టీ పదాధికారులు పాల్గొంటారు. 17న సాయంత్రం హైదరాబాద్‌ సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం.

అందులో ఖర్గేతోపాటు సోనియా, రాహుల్‌, ప్రియాంకాగాంధీలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రజలకు అయిదు ప్రధాన హామీలను ప్రకటించనున్నాం. ఆ సమావేశం ముగిసిన తర్వాత సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నాయకుల ర్యాలీని ఖర్గే ప్రారంభిస్తారు. వారు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి… ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఒక్కొక్కరికీ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాం. 18న నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. కార్యకర్తలతో సమావేశమవుతారు. అయిదు హామీలకు సంబంధించిన కరపత్రాలను, భారాస ప్రభుత్వంపై విడుదల చేసిన ఛార్జిషీట్‌ను ఇంటింటికీ వెళ్లి పంచుతారు. మధ్యాహ్నం వేళ సమాజంలో ప్రభావశీలురైన వ్యక్తులతో కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. సాయంత్రం మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, కుమురంభీం విగ్రహాల వరకు భారత్‌ జోడో యాత్రలు నిర్వహిస్తారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను దృష్టిలో ఉంచుకొని 18వ తేదీ కార్యక్రమాల నుంచి ఎంపీలకు మినహాయింపునిచ్చాం.

7న 722 జిల్లాల్లో భారత్‌ జోడోయాత్రలు
సెప్టెంబరు 7న భారత జాతీయ కాంగ్రెస్‌కు చారిత్రక రోజు. ఆ రోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర మొదలుపెట్టారు. 136 రోజుల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 జిల్లాలు, 76 లోక్‌సభ స్థానాలను చుడుతూ 4,081 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈ యాత్ర పార్టీ కేడర్‌ను, ప్రజలను ఉత్తేజం చేసింది. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించడానికి ఉపయోగపడింది. యాత్ర ప్రారంభమై ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 7న సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 722 జిల్లాల్లో భారత్‌ జోడోయాత్రలు చేపట్టనున్నాం. యాత్ర ముగిసిన తర్వాత భారత్‌ జోడో సమావేశాలు ఉంటాయి.

రేపు పార్లమెంటరీ వ్యూహకమిటీ సమావేశం
18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు 10-జన్‌పథ్‌లో కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహకమిటీ సమావేశం అవుతుంది. రాత్రి 8 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో భావసారూప్య పార్టీల సమావేశం ఉంటుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చిస్తాం.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే…
దేశంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నట్లయితే ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత వారు పూర్తి భయాందోళనకు లోనైట్లే లెక్క. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సమాఖ్య, పార్లమెంటరీ వ్యవస్థలపై దాడి చేయడమే. దీన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలన్నదానిపై ‘ఇండియా’ కూటమి పార్టీలతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానంపై మాకు నమ్మకం లేదు. ప్రస్తుత రాజ్యసభ ప్రతిపక్ష నేతను విస్మరించి, మాజీ ప్రతిపక్ష నేతను కమిటీలో సభ్యుడిగా నియమించడం భాజపాకే చెల్లుతుంది. వారికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదు’’ అని వేణుగోపాల్‌ విమర్శించారు. జైరాం రమేశ్‌ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ లేకుండా జమిలి ఎన్నికలు అసాధ్యమని, రాజ్యాంగ సవరణకు ఏకాభిప్రాయం అవసరం తప్పనిసరి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం జమిలి ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమైనట్లు కనిపిస్తోందని చెప్పారు.

జగన్‌ టచ్‌లో ఉన్నదీ లేనిదీ తెలియదు
కాంగ్రెస్‌లో వైతెపా విలీనం గురించి విలేకరులు ప్రస్తావించగా… సోనియా, రాహుల్‌లతో వైఎస్‌ షర్మిల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, మిగిలిన విషయాల గురించి వేచిచూడాలని కేసీ వేణుగోపాల్‌ బదులిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ తనకా విషయం తెలియదన్నారు.