దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబునాయుడు అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.సోమవారంనాడు ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దోపీడీకి పాల్పడే వ్యక్తి చంద్రబాబు అంటూ ఆయన ఆరోపించారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకొంటూ తన దోపీడీని చంద్రబాబు కొనసాగిస్తున్నాడన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడాన్ని చంద్రబాబే ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు తరహలో ఖర్చు చేస్తే 2014లోనే తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. 1999లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్ధికి చంద్రబాబు కోటి రూపాయాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో డబ్బులు పెంచుకుంటూ పోయారన్నారు.వచ్చే ఎన్నికల్లో కూడ వేల కోట్లు ఖర్చు చేసి విజయం సాధించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులపై కూడ ఆయన స్పందించారు. రూ. 118 కోట్లు రికార్డు అనేది చాలా తక్కువ అని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు లక్ష కోట్లను దోచుకున్నారని ఆయన ఆరోపించారు.రెండు ఎకరాల చంద్రబాబుకు రెండు వేల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.
ఐటీ కేసు నుండి చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టు మాసంలో చంద్రబాబునాయుడికి ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఈ కథనం ఆధారంగా వైఎస్ఆర్‌సీపీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించింది. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనపై ఎన్నో విచారణలు, కేసులు వేసినా ఒక్క విషయాన్నైనా నిరూపించారా అని ఆయన ప్రశ్నించారు.