Agriculture

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో ఏపీ నెంబర్‌ 1

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో ఏపీ నెంబర్‌ 1

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. రైతులందరికీ మంచి జరగాలన్నదే లక్ష్యంతో వారి ఆదాయ మార్గాలు పెంచేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి అధిక మొత్తంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేసింది. తద్వారా వ్యవసాయ ఆధారిత పంటలతో రైతుల ఆదాయం పెంచేందుకు తోడ్పడుతోంది.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని అత్యధిక వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. 20 సూత్రాల అమలు కార్యక్రమం 2022–23 ఆర్థిక సంవత్సరం ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

2022– 23 ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 24,852 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,24,311 కనెక్షన్లను రైతులకు మంజూరు చేసింది. ఒక్క దరఖాస్తు కూడా పెండింగులో లేకుండా దరఖాస్తుచేసిన ప్రతిఒక్కరికీ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది.

లక్షకు పైగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. రైతు ప్రయోజనాల పరిరక్షణ పట్ల జగన్‌ సర్కారుకు ఉన్న ఎనలేని శ్రద్ధకు ఇది నిదర్శనమని విద్యుత్, వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4,54,081 వ్యవసాయ పంపుసెట్లను విద్యుదీకరించాలని లక్ష్యం కాగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రాపాలిత ప్రాంతాలు 7,35,338 కనెక్షన్లు జారీ చేశాయి. ఇందులో 1,24,311 కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే మంజూరు కావడం గమనార్హం.

రాజస్థాన్‌లో…
44,770 వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా 99,137 కనెక్షన్లు విడుదల చేసి రాజస్థాన్‌ రాష్ట్రం దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 25148కు గాను 89,183 వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలో తృతాయ స్థానంలో నిలిచిందిలక్ష్య 1,50,000 కనెక్షన్లు మంజూరు చేయాలని పంజాబ్‌ రాష్ట్రం లక్ష్యం కాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 524 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేసి ‘జీరో’ శాతం లక్ష్య సాధనలో ఉన్నట్లు కేంద ప్రభుత్వం పేర్కొంది. కేవలం 45 కనెక్షన్లు మాత్రమే మంజూరు చేసి సంఖ్యాపరంగా పాండిచ్చేరి చిట్ట చివరి స్థానంలో ఉంది.

ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతోనే సాధ్యం : కె. విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దరఖాస్తుదారులందరికీ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని మార్గదర్శకం చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగులో పెడితే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం పెండింగు దరఖాస్తులన్నింటినీ క్లియర్‌ చేయాలని ఆదేశించింది. దీంతో మౌలిక వసతులు కల్పించి మొత్తం 1,24,311 వ్యవసాయ పంపుసెట్లకు గత ఆర్థిక సంవత్సరం విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేశాం. పెండింగు క్లియర్‌ చేసినందున ప్రస్తుతం దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలు చేస్తున్నాం.