DailyDose

బండి సంజయ్ కి బిగ్‌ షాక్‌-TNI నేటి తాజా వార్తలు

బండి సంజయ్ కి బిగ్‌ షాక్‌-TNI నేటి తాజా వార్తలు

బండి సంజయ్ కి బిగ్‌ షాక్‌

తెలంగాణ మంత్రి  గంగుల కమలాకర్ పై  పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ బండి సంజయ్  పై  తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు  అసహనం వ్యక్తం చేసింది.  మంత్రి గంగుల కమలాకర్ పై  ఎంపీ బండి సంజయ్  పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై  ఇవాళ హైకోర్టు విచారణ నిర్వహించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు  బండి సంజయ్  ఇవాళ హాజరు కాలేదు. అమెరికా పర్యటనలో ఉన్నందున  బండి సంజయ్  ఇవాళ హైకోర్టుకు హాజరు కాలేదు.దీంతో  హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యేందుకు  సమయం కావాలని  హైకోర్టును  బండి సంజయ్ తరపు న్యాయవాది కోరారు. ఇప్పటికే మూడు దఫాలు సమయం కోరిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.  అమెరికా పర్యటనలో ఉన్నందున  బండి సంజయ్ ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కాలేదని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నెల  12న  క్రాస్ ఎగ్జామినేషన్ కు బండి సంజయ్ హాజరౌతారని  హైకోర్టుకు  తెలిపారు. ఎన్నికల పిటిషన్లను  ఆరు మాసాల్లో తేల్చాల్సి ఉందని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.అయితే  రూ. 50 వేల సైనిక సంక్షేమ నిధికి జమ చేయాలని హైకోర్టు బండి సంజయ్ ను ఆదేశించింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటే  రూ. 50 వేలను సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని  హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో  ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.ఈ ఏడాది జూలై 21 నుండి  క్రాస్ ఎగ్జామినేషన్ కోసం  బండి సంజయ్ మూడు వాయిదాలు కోరారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేశారు.  బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో  బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి  బండి సంజయ్  బీజేపీ అభ్యర్థిగా  పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి  వినోద్ కుమార్ పై విజయం సాధించారు.

హైద్రాబాద్‌లో భారీ వర్షాలపై తలసాని సమీక్ష

జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  సూచించారు.జీహెచ్ఎంసీ పరిధిలో  భారీ వర్షాలపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు అధికారులతో  సమీక్ష నిర్వహించారు.రోడ్లపై నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హుస్సేన్ సాగర్ వాటర్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి కోరారు.  నాలాల దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని ఆయన కోరారు.  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ఫిర్యాదులపై  తక్షణమే స్పందించాలని మంత్రి అధికారులను కోరారు.కలెక్టర్,  జీహెచ్ఎంసీ కమిషనర్,  జలమండలి, ట్రాన్స్ కో సీఎండీలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిస్థితిని సమీక్షించారు.  వర్షాలకు  కూలిన చెట్లు, వాటి కొమ్మలను వెంటనే తొలగించాలని మంత్రి సూచించారు.అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.  అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.మూడు రోజులుగా  హైద్రాబాద్ లో కురుస్తున్న వర్షాలకు  నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.ఇవాళ  ఉదయం నుండి  నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ  నాలుగైదు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరికలు  జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ గా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
 

సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడిపోయిన యువకుడు

 సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి ఓ యువకుడు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి ఉప్పొంగి ప్రవహిస్తున్న మందాకినీ నదిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని అతికష్టం మీద ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు కేదార్‌నాథ్‌  యాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో రుద్రప్రయాగ్‌  జిల్లాలో మందాకినీ నది వద్ద సెల్ఫీ తీసుకుంటూ.. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం తాడు సాయంతో తీవ్రంగా శ్రమించి ఆ యువకుడినిప్రాణాలతో బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

కేసీఆర్‌పై అభిమానంతో 72 గంటల సామూహిక ప్రార్థనలు

సామాజి ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జహీరాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో వసంత్ తన అనుచరులు, అభిమానులతో జహీరాబాద్ పట్టణంలోన ఓ ఫంక్షన్ హాల్ లో సమావేశం ఏర్పాటు చేశారు.. ‘మట్టి మనుషుల మనోగతం.. భూమి పుత్రుల ఆకలి కేక’ అనే పేరుతో ఆత్మీయ సమ్మేళనం వినూత్నంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పేరుతో వేదికపై కుర్చీలు వేసి.. మధ్యలో పెద్ద చైర్ పై ముఖ్యమంత్రి కేసిఆర్ ఫోటో పెట్టి ఆయా గ్రామాల నుంచి తెచ్చిన మట్టిని కుర్చీల్లో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. జహీరాబాద్ ప్రాంతంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు అందరూ కలికట్టుగా ముందుకు రావాలని వసంత్ పిలుపునిచ్చారు.. అలాగే తమ పరిధిలో ఉన్న సమస్యల పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోకు సమర్పించారు.అచ్చం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభకు వచ్చి కూర్చునట్లుగా సమావేశం ఏర్పాటు చేశారు వసంత్, తదితరులు. స్టేజి పైన ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో తప్ప మరే ఎవరు లేరు.. సమావేశం మొత్తం స్టేజి కింద ఉండే నిర్వహించారు. తాను ఏకలవ్యుడిగా పని చేస్తానంటూ, ముఖ్యమంత్రి మీద అభిమానంతో 72 గంటల పాటు సామూహిక ప్రార్థన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్టేజి మీద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో.. ఆయన ఫోటో చుట్టూ వివిధ గ్రామాల నుండి తెచ్చిన మట్టిని కుర్చీల్లో పెట్టి చేసిన వినూత్న కార్యక్రమం పలువురుని ఆకర్షణకు గురిచేసింది.కాగా, ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, మేధావులు, నిరుద్యోగులు ఈ ఆత్మీయ సమ్మేళనంకు హాజరైనరు.అలాగే ఢిల్లీ వసంత్ లో బృంద సభ్యులైన మహిపాల్ యాదవ్, బిల్లీ పురం మాధవరెడ్డి, అశోక్ పాటిల్, విశాల్ గోడకే, రహీం ఖురేషి,రమేష్ బాబు కులకర్ణి, అబ్బాస్ మియా, రాజు, కరణం రవి, మల్లేష్ యాదవ్, పాపయ్య, విక్రమ్, ఆనంద్ ఈశ్వర్, హనుమంతు, ఓంకార్, యాసిర్ ఖాన్, బన్సీలాల్, ముదిగొండ శ్రీనివాస్, విష్ణు, శ్రీనివాస్, దినేష్, గోవింద్ రెడ్డి, భూమన్ స్టీవెన్సన్, అనిల్, శంకరయ్య, ఖాదర్, బాలకృష్ణ, హమీద్ సాబ్, గోపాల్ మరియు సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్, వాసుదేవ రెడ్డిలు పాల్గొన్నారు.

ఏడు స్థానాలకు కొనసాగుతున్న ఉప ఎన్నికలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి I.N.D.I.A కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆ కూటమికి ఇవాళ తొలి సవాల్ ఎదురైంది. ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అవి ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, కేరళలోని పుతుపల్లి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్ ధన్‌పూర్ అనే ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఈ ఉప ఎన్నికలు 2024 లో జరిగే ప్రత్యక్ష ఎన్నికలకు అటు కేంద్రంలోని బీజేపీ(ఎన్డీఏ) కూటమి, ప్రతి పక్షంలోని I.N.D.I.A కూటమికి కీలకంగా మారనున్నాయి.

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురు దేవుళ్ళకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మానాన్నల తరువాత అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరేనని అన్నారు. ఉపాధ్యాయులు వీసమెత్తు కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి.. శిష్యుల విజయాలను వారివిగా భావిస్తారని పేర్కొన్నారు. పవిత్రమైన బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టుగా తెలిపారు. తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు- శిష్యులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది, మన దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల ఆంధ్రప్రదేశ్ పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోందని అన్నారు. పాలకులు ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తూనే ఉందని చెప్పారు. ప్రభుత్వ చర్యలు సైతం అందుకు అనుగుణంగానే ఉంటున్నాయని విమర్శించారు. బోధనేతర విధులతో వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. నాడు-నేడు పనుల్లో పాలక పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30వేల మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో ఏ ఉపాధ్యాయుడికీ ఇంకా జీతం చెల్లించలేదు అంటే ఈ ప్రభుత్వానికి గురు దేవుళ్లపై ఏ విధమైన ధోరణిని అవలంభిస్తోందో అర్థమవుతోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుందని హామీ ఇచ్చారు. 

ఏపీలో కరెంటు కోతలపై ప్రభుత్వానికి గందరగోళ ప్రకటనలు: పురంధరేశ్వరి

ఏపీలో కరెంట్ కోతలపై ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోతలు ఉంటాయని ఒకసారి, ఉండవని మరోసారి ప్రకటన చేశారన్నారు. అంటే విద్యుత్ విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. గ్రామాల్లో తొమ్మిది గంటల విద్యుత్ అని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ప్రజలు రోడ్ల పైకి వచ్చి విద్యుత్ కార్యాలయాలను ముట్టడించే పరిస్థితి ఏర్పడిందన్నారు. 240 మిలియన్ యూనిట్లు ఒక రోజుకు అవసరమని.. 198 మిలియన్ యూనిట్లు మాత్రమే మనకు అందుతోందన్నారు. 40మిలియన్ యూనిట్లు కొరత ఉందని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లులో పీపీఎలను జగన్ సీఎం అవగానే రద్దు చేశారన్నారు. జగన్ ప్రభుత్వం ప్రకటనలతో పెట్టుబడిదారులు రాని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతులు, గ్రామీణ ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. విద్యుత్ అవసరాలు, వినియోగంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరులోనే ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. వచ్చే వేసవి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందారు. విద్యుత్ కోతలు నివారించాల్సిన సీఎం విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని.. ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని పురందేశ్వరి ప్రశ్నించారు.

గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధలు ఉల్లంఘించినట్టుగా  ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతేడాదిని నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలోనే చైనాకు గ్రానైట్ ఎక్స్‌పోర్ట్స్‌లో అవకతవకలు జరిగినట్టుగా నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ అక్రమంగా తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రూ. 4.8 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా గుర్తించినట్టుగా సమాచారం. హవాల మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా తేల్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో రూ. 50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా.. రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు.  ఇక, శ్వేతా గ్రానైట్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులకు గతంలో కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్వేతా గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోమారు శ్వేతా గ్రానైట్ కంపెనీకి చెందిన ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.

*  బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్యే బిగ్ షాక్

బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో స్టేషన్‌ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో ఇప్పటికే పలు వేదికలుగా కన్నీటి పర్యాంతమయ్యారు రాజయ్య. అనుచరులు, కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది.తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ అయ్యారు. హనుమకొండ నయీమ్ నగర్‌లోని ఓ హోటల్లో ఇద్దరు నేతలు కలిశారు. తెలంగాణలోని తాజా రాజకీయాల పరిస్థితులపై చర్చలు జరిపారు. ఇదే టైమ్‌లో పార్టీలో చేరిక, టికెట్‌పై మాట్లాడినట్లు రాజకీయ వర్గాల్లో టాక్. అయితే హనుమకొండలో దళిత మేధావుల సదస్సు నిర్వహించేందుకు దామోదర రాజనర్సింహ అక్కడకు వెళ్లారు. ఇదే సదస్సుకు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ నేతతో రాజయ్య కలిసి మాట్లాడడంతో.. కాంగ్రెస్ చేరడం లాంఛనమేననే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం లేకపోలేదంటున్నారు.అయితే బీఆర్ఎస్‌లో సీటు దక్కన ఆశావాహులంతా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పంచనా చేరుతున్నారు. రీసెంట్‌గా ఖమ్మం కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు సైతం త్వరలోనే కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే బాటలో రాజయ్య కూడా పయనిస్తారని.. ఇప్పటికే కార్యకర్తలు, అభిమానులతో పలు దఫాలు భేటీ నిర్వహించి వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారనే టాక్ ఉంది. కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలకు రాజయ్య చెక్ పెడతారో..? లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

భోపాల్​లో విపక్ష కూటమి నాలుగో సమావేశం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్​ను ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో ఉంది విపక్ష కూటమి ఇండియా. ఈ క్రమంలోనే వరుస భేటీలతో వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ముంబయిలో మూడోసారి సమావేశమైన ఈ కూటమి త్వరలో నాలుగోసారి భేటీ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. నాలుగో దఫా భేటీకి మధ్యప్రదేశ్​లోని భోపాల్ వేదిక కానున్నట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. భోపాల్​లో మీటింగ్​తో పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపాయి.తర్వాతి దశ సమావేశం గురించి ముంబయి మీటింగ్​లోనే చర్చలు జరిగాయని ఆయా వర్గాలు వివరించాయి. వివిధ పార్టీలన్నీ భోపాల్​లో సమావేశానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి. ఇందుకు సంబంధించి తేదీలు ఇంకా ఖరారు చేయలేదని వివరించాయి. అక్టోబర్​లో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సమావేశాల్లో చర్చించిన అంశాలు, ఇతర అజెండాలపైనా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. మీటింగ్ నిర్వహణకు దిల్లీ పేరును సైతం పరిశీలించినట్లు కూటమి వర్గాలు చెప్పాయి. అయితే, చివరకు భోపాల్​వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.