Health

కొబ్బరి పీచుతో క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చా?

కొబ్బరి పీచుతో క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చా?

మనమైతే కొబ్బరి పీచును ఏం చేస్తాం? చెత్త కుప్పలో పడేస్తాం. కానీ శాస్త్రవేత్తలు అలా కాదు. వ్యర్థాలనూ ఉపయోగపడేలా మార్చేస్తారు. బనారస్‌ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఇలాంటి పనే చేశారు. కొబ్బరి పీచులోంచి వినూత్న సుగంధ రసాయనాన్ని సంగ్రహించి ఔరా అనిపించారు. విశృంఖల కణాలను అరికట్టే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు గల ఇది సూక్ష్మక్రిములను, క్యాన్సర్‌ను అడ్డుకుంటుండటం విశేషం. కొబ్బరి పీచులో లిగ్నోసెల్యులోజ్‌ అనే బయోమాస్‌ దండిగా ఉంటుంది. దీన్నుంచి సుగంధ ద్రవ్యాన్ని తయారు చేయొచ్చని ఇప్పటికే బయటపడింది. ఈ ప్రక్రియను మనదేశ పరిశోధకులు మరింత ముందుకు తీసుకెళ్లారు. లిగ్నోసెల్యులోజ్‌ను బాసిలస్‌ ఆర్యభట్టై సాయంతో పులియబెట్టి వంటకాలకు రుచిని తెచ్చే రసాయనాన్ని సంగ్రహించటంలో విజయం సాధించారు. ముందుగా కొబ్బరి పీచును శుద్ధి చేసి, 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద 72 గంటల పాటు ఎండించి, సన్నగా పొడి చేశారు. దీన్ని హైడ్రో డిస్టిలేషన్‌ ప్రక్రియతో వడగట్టి, ఆమ్లీకరించి లిగ్నిన్‌, సెల్యులోజ్‌ను వేరు చేశారు. అనంతరం బాసిలస్‌ ఆర్యభట్టైతో లిగ్నిన్‌ను పులియబెట్టి, ఆ ద్రవాన్ని వడగట్టి అవశేషాన్ని సంగ్రహించారు. దీన్ని 15 నిమిషాల సేపు అపకేంద్ర యంత్రంలో ఉంచి, సేంద్రీయ పదార్థాలను సేకరించారు. బాష్పీకరణ ప్రక్రియతో తడిని తొలగించగా చివరికి సుగంధ ద్రవ్యం మిగిలింది. కణాల మీద పరీక్షించగా దీనికి రొమ్ము క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే గుణం ఉన్నట్టు బయటపడింది.