Sports

చైనా ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే భారత ఆటగాళ్లకు షాక్

చైనా ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే భారత ఆటగాళ్లకు షాక్

చైనా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. ఇటీవల ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ (HS Prannoy) తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ యాంగ్‌ (మలేసియా)తో చేతిలో ఓటమిపాలయ్యాడు. గంట ఆరు నిమిషాలపాటు జరిగిన పోరులో ప్రణయ్ 12-21 21-13 18-21 తేడాతో పరాజయం చవిచూసి తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్‌కు కూడా నిరాశే మిగిలింది. ఆండర్స్‌ ఆంథోన్సెన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన పోరులో 21-23, 21-16, 9-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. గంట 18 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ మొదటి రెండు గేమ్‌ల్లో గట్టిగానే పోరాడినప్పటికీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చేతులేత్తేశాడు. షెసర్‌ హిరెన్‌ (ఇండోనేసియా)తో జరిగిన పోరులో ప్రియాన్షు రజావత్‌ 13-21, 24-26 తేడాతో ఓడిపోవడంతో పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసినట్లయింది.

అటు, మహిళల డబుల్స్‌లోనూ భారత షట్లర్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. టాప్‌ సీడ్‌ కింగ్‌ చెన్‌- జియా ఫాన్‌ (చైనా) జోడీతో జరిగిన మ్యాచ్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జంట 18-21, 11-21 వరుస గేమ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఆసియా క్రీడలపై దృష్టిసారించడం కోసం స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు, ప్రపంచ మాజీ నంబర్ వన్ కిందాబి శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌కు దూరంగా ఉన్నారు.