అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్‌గా తేలారు. అధ్యక్షుడు బైడెన్‌కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. 72 ఏళ్ల ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ గత కొన్ని రోజుల నుంచి స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం దిలావర్‌లోని రిహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఆమె గడుపుతున్నారు. ఏడాది కాలం తర్వాత జిల్ మళ్లీ కోవిడ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.
80 ఏళ్ల అధ్యక్షుడు జో బైడెన్‌కు సోమవారం కోవిడ్ పరీక్ష చేపట్టారు. ఆ పరీక్షలో ఆయన నెగటివ్‌గా తేలినట్లు వైట్‌హౌజ్ తెలిపింది. నిరంతరం ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలను గమనించనున్నట్లు వైట్‌హౌజ్ వెల్లడించింది.ఇటీవల అమెరికాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయి. గత కొన్ని వారాల నుంచి హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మరో రెండు రోజుల్లో ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు జో బైడెన్ హాజరవుతారా లేరా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.