తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి తొలి సమావేశం మంగళవారం టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Karunakar Reddy) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని అన్నమయ్య భవన్‌లో పాలకమండలి సమావేశ అనంతరం సమావేశ వివరాలను చైర్మన్ మీడియాకు వివరించారు.
సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 25 ఏళ్లలోపు యువత గోవింద కోటి (Govinda Koti) ని రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం (VIP Darsan) కల్పిస్తామని వెల్లడించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ముంబాయి బాంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచార కేంద్రం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 29 స్పెషలిస్ట్, 15 చిన్నపిల్లల వైద్యులతో పాటు 300 మంది ఉద్యోగుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వీటితో పాటు రూ. 2.16 కోట్లతో టీటీడీ ఆస్పత్రుల్లో (TTD hospital) మెడిసిన్ కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 18 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకూ జరుగుతాయని చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అధిక మాసం కావడం వల్ల అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahamotsavam) జరుగుతాయన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అదే రోజు టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పునఃనిర్మాణం, రూ. 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనులకు నిధులు కేటాయించామన్నారు. పోటులో పెండింగ్‌లో ఉన్న 413 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేయాలని సమావేశం నిర్ణయించినట్లు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ధి పనులకు రూ.4.15 కోట్లు కేటాయించామన్నారు.