NRI-NRT

రేపు భారత పర్యటనకు రానున్న బైడెన్

రేపు భారత పర్యటనకు రానున్న బైడెన్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వైద్యులు మరోమారు కరోనా టెస్ట్ చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్ కు కరోనా రావడంతో ఇప్పటికే ఒకసారి ఆయనకు టెస్టు చేశారు. అందులో కరోనా నెగెటివ్ గా తేలింది. తాజాగా జరిపిన పరీక్షలోనూ అధ్యక్షుడికి కరోనా నెగెటివ్ అనే వచ్చిందని వైద్యులు చెప్పారు. దీంతో ప్రెసిడెంట్ ఇండియా పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ప్రెసిడెంట్ బైడెన్ మాస్క్ ధరించి జీ20 సమావేశాలకు హాజరవుతారని పేర్కొంది. గురువారం ఢిల్లీకి చేరుకోనున్న బైడెన్.. ఈ టూర్ మొత్తం పూర్తిస్థాయిలో కరోనా గైడ్ లైన్స్ పాటిస్తారని వివరించింది. ఈ ప్రకటనతో బైడెన్ ఇండియా పర్యటనపై నెలకొన్న సందేహాలకు వైట్ హౌస్ చెక్ పెట్టింది.

ఇదిలా ఉండగా ఈ నెల 7న బైడెన్ ఢిల్లీకి రానున్నారు. ఈ నెల 8న భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. ఇక 9,10 వ తేదీల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా వియాత్నం వెళతారు. జీ20 సదస్సుకు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా వివిధ దేశాధినేతలు హాజరవుతారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగిస్తారు.