దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాలోని డాలస్ నగరంలో ప్రవాసాంధ్రులు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని టెక్సాస్‌లో బ్లెడ్ డ్రైవ్ నిర్వహించారు.
డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైఎస్సార్ సభ్యులు తెలిపారు. ఈ రక్త దాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతీ సంవత్సరం బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయటం పట్ల అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు.ఈ సందర్భంగా జన హృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత , పేద ధనిక పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఎంత మంది సీఎం లు పాలించిన కూడా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో కొలువైనారని, నిజమైన అమరత్వం అంటే ఇదే అని పలువురు కొనియాడారు.