తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ నోటీసులపై పరోక్షంగా స్పందించారు. రేపో ఎల్లుండో తనను అరెస్ట్ చేయవచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం లో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాక్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తోందని మండిపడ్డారు. జగన్ అరాచక పాలనను అంతమెుందించేందుకు ఇంటికొకరు చొప్పున ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. అంతేకాదు తనపై కూడా దాడి చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా.. ఎలాంటి దాడులకు పాల్పడినా తాను మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజారిటీ వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు.