* నూతన భవనంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దిగ్విజయంగా నూతన పార్లమెంట్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. అయితే.. నూతన పార్లమెంట్లో మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని అందరూ ఊహించారు. కానీ కేంద్రం ఈ నెల 18-22 వరకు ప్రత్యేక సమావేశాలను కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పార్లమెంట్లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు వంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. ఈ సెషన్ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. ఈ సమావేశాల అజెండా ఏంటో తెలపాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు.
* వజ్రాలతో మోడీ ఫోటో
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, నియమాల వల్ల కొందరు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. దేశ, విదేశాల్లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరల్డ్ వైడ్ గా మోదీ పేరు అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. మోదీ అంత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే మోదీకి అనేకమంది అభిమానులు సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు.. ఆయన పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.. గతంలో చాలామంది ఆయనకు ప్రత్యేమైన గిఫ్ట్ లను పంపించారు.తాజాగా మోదీ వీరాభిమాని అతనికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.. అత్యంత ఖరీదైన గిఫ్ట్ అందించాడు…ఏకంగా 7200 వజ్రాలతో ప్రధాని ఫొటో తయారుచేశాడు. మోదీకి ఈ అరుదైన గిఫ్ట్ ను అభిమాని ఇవ్వబోతున్నాడు. సెప్టెంబర్ 17న మోదీ తన పుట్టినరోజుని జరుపుకోనున్నారు. ఈ పుట్టినరోజు మోదీ 73వ పుట్టినరోజు బర్త్ డే సందర్బంగా మోదీకి ఒక అభిమాని అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్నాడు. సూరత్‌కి చెందిన విపుల్ జేపీవాలా అనే వ్యక్తి మోదీకి వీరాభిమాని..అతను ఒక అర్కిటేక్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.. అలాగే కొద్దికాలంగా వజ్రాలతో పెయింటింగ్ లు వేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా దాదాపు మూడున్నర నెలలు కష్టపడి మోదీ చిత్రపటాన్ని తయారుచేశాడు. మూడు వేర్వేరు రంగుల వజ్రాలను ఈ ఫొటో తయారుచేయడానికి వాడాడు.. మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ భార్యకు వజ్రాలు పొదిగిన క్రాఫ్ట్ ను బహుమతిగా ఇచ్చాడు. దానిని చూసి తర్వాత ప్రధాని మోదీ ఫొటోలను రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు ఈ అభిమాని చెబుతున్నాడు.. ఈ వజ్రాలు ఎప్పటికి ఊడిపోకుండా ప్రత్యేకమైన గమ్ తో అతికించాడు..అంతేకాదు ఎక్కువకాలం చిత్రపటం నుంచి విడిపోకుండా ఉండేలా వజ్రాలను కూడా తీసుకున్నాడు.. ఆ ఫోటో ఫ్రెమ్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి..
* తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాకాలంలో 20 శాతం అధిక వర్షపాతం నమోదయిందని వాతావరణశాఖ తెలిపింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 603.2 మి.మీ కాగా… ఇప్పటి వరకు 723.1 మి.మీ వర్షపాతం నమోదయిందని వెల్లడించింది.
* నోటిఫికేషన్ రాకముందే పార్టీలు అలర్ట్
నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతున్న వేళ.. కొన్ని సెగ్మెంట్లలో నేతలు అప్పుడే ప్రచారపర్వానికి తెరలేపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం గిఫ్ట్ రాజకీయాలు జోరందుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆలస్యం చేసిన ఆశాభంగం అన్న చందంగా గిఫ్ట్‌లు పంచుతూ ఓటర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గిఫ్ట్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్నాయి.ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొందరు నేతలు మాటలతో చమత్కారం చేస్తుంటే.. మరికొందరు హామీలతో ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్‌పై కంది శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే.. టికెట్ కన్ఫర్మ్ కాకముందే ప్రజాకర్షణ కార్యక్రమాలకు తెరలేపారు. ఇంటింటికీ ప్రెషర్ కుక్కర్లు పంచుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుక్కర్లున్న గోడౌన్లపై పోలీసులు దాడులు చేశారు.దీనిపై స్పందించిన కంది.. ఆదిలాబాద్ ప్రాంత వాసులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేస్తుంటే అది చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే ఇలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే జిల్లాలో బీఆర్ఎస్కు చెందిన ఓ ముఖ్య నేత సైతం ఇటీవల గొడుగులను పంపిణీ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. మరింత మంది ఎమ్మెల్యేలు కూడా తాయిలాలు పంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది.అభ్యర్థుల ప్రకటనతో ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఉన్న వ్యతిరేకతను తప్పించుకునేందుకు రకరకాలుగా స్కెచ్‌లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గొడుగుల పంపిణీని షురూ చేశారు. గొడుగులతోపాటు బీడీ టేకేదార్లకు చీరలను పంచిపెట్టారు. బీఆర్ఎస్ కలర్, కేసీఆర్ ఫొటోతో కూడిన గొడుగుల వల్ల ఇటు ప్రజలకు ఉపయోగంతోపాటు తమకూ ప్రచారం కలిసి వస్తుందని అధికార పార్టీ నేతలు ఈ తరహా ఆలోచన చేస్తున్నారు.
* రాజకీయాల్లోకి లగడపాటి రీఎంట్రీ
కాంగ్రెస్ మాజీ నేత, కరుడు గట్టిన సమైఖ్య వాది లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే లగడపాటి రాజగోపాల్ రీ ఎంట్రీ కోసం అనుచరుల సన్నాహక సమావేశం ఇవాళ విజయవాడలో జరిగిందని సమాచారం అందుతోంది. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతోంది ఆయన వర్గం.ఈ నెలాఖరులో అనుచరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న రాజగోపాల్..విజయవాడ సిటీలో ఓ హోటల్ లో నిన్న రహాస్య భేటీ జరిపారట. వచ్చే ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా బరిలోకి దిగాలని కోరుతున్నారు ఆయన అనుచరులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పొలిటికల్ కెరీర్ కు స్వస్తి పలికిన రాజగోపాల్…ఇప్పుడు రీ – ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది.
* ముగిసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
TS: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మురళీధరన్ అధ్యక్షతన 3 రోజుల పాటు సాగిన సమావేశాలు ముగిశాయి. అభ్యర్థుల నివేదికను ఈ కమిటీ రూపొందించి సాయంత్రం ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందించనుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంశాలపై స్కీనింగ్ కమిటీతో సుదీర్ఘంగా చర్చించామని మాణిక్‌రావ్ ఠాక్రే తెలిపారు. అన్ని అంశాల పరిశీలన తర్వాత త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
* కవితకు షర్మిల లేఖ
ఎమ్మెల్సీ కవితకు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి లేఖ రాశారు. మహాత్మా గాంధీ చెప్పినట్లు మీరు చూడాలి అనుకుంటున్న మార్పు, మీ నుంచే మొదలు పెట్టండి..మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి 5 శాతం కూడా మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.నా అభిప్రాయంతో పాటు,ఇటీవల BRS అభ్యర్థుల జాబితా సైతం పంపుతున్న… జాబితా తో పాటు ఒక కాలిక్యులేటర్ లింక్ సైతం పంపిస్తున్నానని లేఖలో వివరించారు. BRS జాబితా చూసి 33శాతం ఇచ్చారా? లేదా? లెక్కించండని.. మద్దతు కూడగట్టే ముందు మీ తండ్రితో ఈ విషయం చర్చ చేయాలని మనవి అంటూ పేర్కొన్నారు.2004 నుంచి ఇప్పటి వరకు మహిళలకు మీరిచ్చిన సీట్లు ఎన్ని ? 2014లో మహిళలకు మీరిచ్చిన సీట్లు 6 అని గుర్తుకు లేదా ? అని కవితపై విరుచుకుపడ్డారు. 2018 లో మీరిచ్చిన సీట్లు 4 అని మీకు కనపడటం లేదా ?సీట్ల కేటాయింపు లో ఒక మహిళగా మీరు నోరు ఎందుకు ఎత్తలేదు ? అని ప్రశ్నించారు షర్మిల.
* గూగుల్ వచ్చిన తరువాత గురువుల అవసరమే లేదు : మంత్రి
కాలం ఎంత మారినా, ఎంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సరే దాని గురించి చెప్పడానికి ఓ గురువు కావాల్సిందే.. అంటే సమాజంలో గురువుకు ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచం ఎంతగా మార్పుచెందినా గురువు స్థానంలో మార్పుండదు. అయితే, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాత్రం గురువులను తక్కువ చేస్తూ వ్యాఖ్యానించారు. అదికూడా సాక్షాత్తూ గురుపూజోత్సవం రోజే కావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ ఏంజరిగిందంటే.గురుపూజోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ వ్యాఖ్యానించారు. గూగుల్ వచ్చాక గురువుల అవసరం పెద్దగా లేకుండా పోయిందని అన్నారు. గురువులకు తెలియని విషయాలు కూడా గూగుల్ లో కొడితే వస్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబుల్లో సమస్త సమాచారాన్ని బైజూస్ టెక్నాలజీ పొందుపరిచిందని వివరించారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని అన్నారు.
* ఇండియా పేరును భారత్ గా మారిస్తే మంచిదేనన్న రోజా
మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇండియా పేరును భారత్ గా మారిస్తే మంచిదేనని చెప్పారు. ఇంగ్లీష్ లో ఇండియా అని పిలవడం కంటే మన భాషలో భారత్ అని పిలవడం బాగుంటుందని అన్నారు. భారత్, భారతదేశం అనే పదాలు చిన్నప్పటి నుంచి మనకు సుపరిచితం అని చెప్పారు. ఇండియా పేరును భారత్ గా మారిస్తే స్వాగతిస్తానని అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
* కోమటిరెడ్డి మరోసారి అసంతృప్తి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోకి కీలకమైన కేంద్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో కోమటిరెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌ను కూడా ఆయన కలవలేదు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. కోమటిరెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడారు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల వారి వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.