Politics

ప్రధాని మోడీకి సోనియా లేఖ

ప్రధాని మోడీకి సోనియా లేఖ

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బుధవారంనాడు లేఖ రాశారు.ఈ నెల 18వ తేదీ నుండి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండా ఇవ్వాలని ఆమె ఆ లేఖలో కోరారు.
ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఎజెండాను వెల్లడించాలని సోనియా గాంధీ ఆ లేఖలో కోరారు. ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంపై కేంద్రం తీరుపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడ ఏ పార్టీతో కూడ కేంద్రం సంప్రదింపులు జరపలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఎజెండాను బహిర్గతపర్చకపోవడం వాస్తవ సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడమేనని ఖర్గే పేర్కొన్నారు.

ఒకే దేశం, ఒకే ఎలక్షన్ కు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ విషయమై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కూడ కమిటీని కేంద్రం ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.