మొన్నటి వరకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ పై ఏది కావాలన్నా ఆధారపడే వాళ్లం. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ హవా నడుస్తుంది. ఎక్కడ చూసిన చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ గురించే వినిపిస్తుంది. అయితే ఇవే ఇప్పుడు విద్యాసంస్థలకు తల నొప్పిగా మారాయి. విద్యార్థులు ఈ ఏఐ టూల్స్ ను ఉపయోగించి తమ పనులను చకచక చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థుల సృజనాత్మకత దెబ్బతింటుందని కాలేజీలు, యూనివర్శిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక తాజాగా అమెరికాలోని కొన్ని కాలేజీలకు ఈ టూల్స్ మరీ తలనొప్పిగా మారాయి. యూఎస్ లో కొన్ని కాలేజీలలో, యూనివర్శిటీలలో విద్యార్థులు చేరాలంటే వారి హిస్టరీ మొత్తం ఒక వ్యాసం రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే వారికి అడ్మిషన్లు ఇస్తారు. ఇందులో విద్యార్థులు రైటింగ్ స్కిల్స్ ను కూడా ఆయా విద్యాసంస్థలు చెక్ చేస్తాయి.
అయితే చాలా మంది విద్యార్థులు చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ ను ఉపయోగించి ఈ పనిని సులువుగా చేసేస్తున్నారు. ఎవరి వ్యాసం చూసిన అద్భుతంగా అనిపిస్తుంది. దీంతో ఎవరికి అడ్మిషన్ ఇవ్వాలో తెలియక విద్యా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే కొన్ని యూనివర్శిటీలు ఈ ఆర్టిఫిషియల్ టూల్స్ పై నిషేధం విధించాయి. కొన్ని యూనివర్శిటీలు వీటిని పాక్షికంగా ఉపయోగించవచ్చని తెలిపాయి. ఇదిలా వుండగా మిచిగాన్ యూనివర్సిటీ అయితే వీటి వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ ఏఐ టూల్స్ అందుబాటులోకి రాగానే ప్రారంభంలోనే విద్యాసంస్థలు స్టూడెంట్స్ భవితవ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. ఇవి వాడటానికి ఎంతో సులభంగా ఉండటంతో పాటు సమాచారం కూడా కావాల్సిన విధంగా రావడంతో మెదళ్లకు పని చెప్పడం మానేస్తారని అనుమానం వ్యక్తం చేశాయి. తాజాగా ఇది చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.