టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… వారిద్దరూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.118 కోట్ల అక్రమాలు అంటూ ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై వారు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా టీడీపీ అధినేతకు వచ్చిన ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. ఆయన తన మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అని చురకలు అంటించారు. ఇక, పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలో లేక బాబు బీజేపీ అధ్యక్షురాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై ఆమె ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.చంద్రబాబు చిత్తూరు జిల్లా ద్రోహి అని రోజా విమర్శలు గుప్పించారు. 2003లో ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని ఆయన మూయిస్తే, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తెరిపించారన్నారు. సీఎం జగన్ బకాయిలను తీర్చాడన్నారు. చిత్తూరు, విజయ డైరీలను చంద్రబాబు మూయించాడని ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు టీడీపీ అధినేత చేసింది శూన్యమన్నారు. అమరావతిని అవినీతి రాజధానిగా చేశారన్నారు. పుంగనూరు తరహా ఘటనను భీమవరంలోను టీడీపీ రిపీట్ చేసిందన్నారు.