రద్దవుతున్న రూ.2వేల నోట్ల పేరుతో భారీ మోసం జరిగింది. రూ.1700 ఇస్తే రూ.2వేల నోటు ఇస్తామని నమ్మబలికిన ఓ ముఠా భారీ మొత్తంలో డబ్బు తీసుకెళ్లిన ఘటన నంద్యాలలో జరిగింది. ఈకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు.నంద్యాల పట్టణంలోని నూనెపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డికి గుంతకల్లుకు చెందిన వరప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, వాటిని మారిస్తే 15శాతం కమీషన్ ఇస్తామని వరప్రసాద్ నమ్మబలికారు. అందుకు అంగీకరించిన శ్రీనివాసరెడ్డి మరో ఐదుగురితో కలిసి రూ.2.20 కోట్లు సేకరించాడు. అందుకు రూ.30లక్షలు కమీషన్‌గా ఇచ్చేందుకు వరప్రసాద్ అంగీకరించాడు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 20న నంద్యాల సమీపంలోని రైతు నగరం వద్దకు వరప్రసాద్‌తో పాటు మరో ఏడుగురితో కూడిన ముఠా రెండు వాహనాల్లో వచ్చి శ్రీనివాసరెడ్డి నుంచి రూ.2.20కోట్లు తీసుకున్నారు. అదే సమయంలో వారిలో కొందరు పోలీస్ సైరన్ వాహనంలో అక్కడికి చేరుకొని భయపెట్టడంతో అందరూ హడావుడిగా వెళ్లిపోయారు. ఇదే సమయంలో డబ్బులు తీసుకొని ముఠా సభ్యులు ఉడాయించారు. బాధితుడు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్టు నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. నిందితులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టంకశాల శోభన్‌బాబు, కంచరణ చినబాబు అని వివరించారు. వారి వద్ద నుంచి రూ.70లక్షలు స్వాధీనం చేసుకున్నామని, మిగలిన వారిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.