ఆంధ్ర కళా వేదిక-ఖతార్ ఆధ్వర్యంలో వైభవోపేతంగా “గురు పూజోత్సవం” వేడుకలు
ఉపాధ్యాయుల అమూల్యమైన కృషిని గౌరవించేందుకు ప్రతి సంవత్సరం ఆంధ్ర కళా వేదిక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “గురు పూజోత్సవం” కార్యక్రమాన్ని, ఈ ఏడాది కూడా 05 సెప్టెంబర్ 2023 మంగళవారం నాడు ప్రఖ్యాత తత్వవేత్త, పండితుడు మరియు భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఐసీసీ ముంబై హాల్ లో ఎంతో వైవిధ్యంగా మరియు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) అధ్యక్షులు శ్రీ A. P. మణికంఠన్, ఉపాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్య హెబ్బాగులు, జనరల్ సెక్రటరీ శ్రీ మోహన్, హెడ్ అఫ్ ఇన్-హౌస్ ఆక్టివిటీస్ శ్రీ సత్యనారాయణ మలిరెడ్డి హాజరయినారు. అలాగే తెలుగు ప్రముఖులు శ్రీ K.S. ప్రసాద్, శ్రీ ఇంద్రగంటి ప్రసాద్ మొదలగు వారందరు కూడా హాజరయినారు. కార్యక్రమ నిర్వహణ విధానం, హాజరైన ఉపాధ్యాయుల స్పందన, వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసాయి. వారందరినీ పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో సన్మానించడం జరిగిందిఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను చక్కగా రూపొందించడానికి తమ జీవితాలను అంకితం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులు మరియు సమాజం, వారి కృతజ్ఞతలు మరియు ప్రశంసలను తెలియజేసే రోజు అయిన సెప్టెంబర్ 5న ఈ “గురు పూజోత్సవం” జరుపుకోవడం ముదావహం అని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, విద్య మరియు తత్వశాస్త్రానికి కూడా గణనీయమైన కృషి చేశారు అన్నారు.
అంతేకాక ఖతార్ లో ప్రప్రధమంగా ఈ “గురు పూజోత్సవం” కార్యక్రమ నిర్వహణ కేవలం ఆంధ్ర కళా వేదిక ద్వారా మాత్రమే మొదలైనందుకు చాల ఆనందంగానూ మరియు గర్వంగానూ ఉందని అన్నారు. ఖతార్ లోని భారతీయ పాఠశాలలు (DPS-మోడరన్ ఇండియన్ స్కూల్, DPS-Monarch ఇంటర్నేషనల్ స్కూల్, లొయోల ఇంటర్నేషనల్ స్కూల్, Greenwood ఇంటర్నేషనల్ స్కూల్, Ideal ఇండియన్ స్కూల్, Podar Pearl స్కూల్, బ్రిలియంట్ అకాడమీ, బిర్లా పబ్లిక్ స్కూల్ మరియు ఖతార్ ఫౌండేషన్) ల లో పనిచేస్తున్న సుమారు 55 మంది తెలుగు ఉపాధ్యాయులను అభినందిస్తూ వారిని పుష్పగుచ్ఛాలతో, శాలువాలతో మరియు చిరు జ్ఞాపికతో సత్కరించటం చేశామని, పైన తెలిపిన పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మరియు పాఠశాలల యాజమాన్యాలకు, వారు చేస్తున్న కృషికి, అందిస్తున్న తోడ్పాటుకి మరియు సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు “గురు పూజోత్సవం” పై తమకున్న అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతటి బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని అద్భుతంగా మరియు వైవిధ్యంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని బహు ప్రశంసించారు.
కార్యక్రమంలో భాగంగా హాజరైనవారందరికి రుచికర భోజనం అందించారు. ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, శ్రీ సుధ, శిరీషా రామ్, వీబీకే మూర్తి, రవీంద్ర, సోమరాజు, సాయి రమేష్ మరియు శేఖరం రావు కి అభినందనలు తెలియజేసి కార్యక్రమాన్ని వైభవోపేతంగా ముగించారు.