Health

నెలాఖరు నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం అమలు

నెలాఖరు నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం అమలు

గ్రామస్థాయిలో ఈ నెలాఖరు నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. బుధవారం అమరావతి నుంచి సీఎంవో కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ తేజ్‌భరత్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఈ నెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నందున తహసీల్దార్లు, ఎంపీడీవోలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 6న సమన్వయ శాఖల ద్వారా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంటుందని, 15 నుంచి వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు తెలుసుకుని వాటిని నిర్దేశించిన యాప్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలన్నారు. గ్రామ హెల్త్‌క్లినిక్‌, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు నిర్వహించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమం విజయవంతానికి జిల్లా, మండల స్థాయిల్లో సమన్వయ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.