WorldWonders

కేరళలో అత్యంత పొడవైన అద్దాల వంతెన

కేరళలో అత్యంత పొడవైన అద్దాల వంతెన

కేరళ అంటే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే గొర్తుకొస్తాయి. ప్రకృతి సోయగాలకు నెలవైన ఈ దేవభూమిని జీవితంలో ఒకసారైనా సందర్శించాలని ఎంతోమంది కోరుకుంటుంటారు. దేశంలో పర్యాటక రంగానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచే ప్రదేశాల్లో కేరళ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఇడుక్కి జిల్లాలోని వాగమన్‌ ప్రాంతంలో గాజు వంతెన ప్రారంభమైంది. గాజు వంతెనల్లో దేశంలోనే అతి పొడవైన వంతెన ఇదే కావడం విశేషం.

సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ వంతెనను కేరళ పర్యాటక మంత్రి పి.ఎ.మహమ్మద్‌ రియాస్‌ బుధవారం ప్రారంభించారు. దీని పొడవు 40 మీటర్లు. ఈ గ్లాస్‌ వంతెనపై ఏకకాలంలో 15 మంది ఎక్కి ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. పిపిపి భాగస్వామ్యంతో ₹3కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు ఎంట్రీ ఫీజును రూ.500లుగా నిర్ణయించినట్టు జిల్లా టూరిజం ప్రొమోషన్‌ కౌన్సిల్‌ (DTPC) అధికారులు వెల్లడించారు. దీంతో పాటు స్కై వింగ్‌, స్కై సైక్లింగ్‌, స్కై రోలర్‌, రాకెట్‌ ఇంజెక్టర్‌, జెయింట్‌ స్వింగ్‌ వంటి అనేక సాహసోపేతమైన అనుభూతిని పర్యాటకులకు పంచేందుకు అడ్వంజర్‌ టూరిజం పార్కును ప్రారంభించారు. ఈ గాజు వంతెన నిర్మాణం కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 35 టన్నుల స్టీలును వినియోగించినట్టు అధికారులు తెలిపారు.

ఈ గాజు వంతెన మరింతగా పర్యాటకులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని డీటీపీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గాజు పలకల ఆధారంగా రూపొందించిన ఈ వంతెన బాటపై నడిచి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. పచ్చని ప్రకృతి, పొగమంచు అందాల మధ్య ఈ బాటపై అడుగులు వేస్తుంటే ఆకాశంలో నడుస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఈ వంతెనపైకి ఎక్కిన సందర్శకులు సమీపంలోని కుట్టిక్కల్‌, కొక్కయార్‌ వంటి ప్రదేశాలను వీక్షించవచ్చు.